All Rounders In World Cup 2023 :క్రికెట్లో ఉన్న ప్లేయర్స్ ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు బ్యాటింగ్‌లో చెలరేగుతారు. మరికొందరు బౌలింగ్‌లో విజృంభిస్తారు. కానీ ఇంకొందరు మాత్రం ఈ ఇద్దరికంటే భిన్నం. బ్యాటింగ్‌లో దంచికొట్టడమే కాకుండా.. బంతి అందుకుని ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంటారు. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ భారాన్నీ మోస్తారు. వాళ్లనే ఆల్‌రౌండర్స్ అంటారు. ఇక క్రికెట్లో ఈ ఆల్‌రౌండర్లకు ఉండే రేంజే వేరు. ఇక రానున్న వన్డే ప్రపంచకప్‌లోనూ మ్యాచ్‌ల ఫలితాలను నిర్దేశించనున్నదే వీళ్లే. ఈ క్రమంలో ఆయా జట్లలో ఉన్న మేటి ప్లేయర్లను ఓ సారి చూద్దామా..
- హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా.. టీమ్ఇండియాకు ఈ ఇద్దరు ఆల్‌రౌండర్లు అండ ఉంది. ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమైనప్పటికీ.. హార్దిక్ వాటిని అధిగమించి మళ్లీ లయ అందుకున్నాడు. ఆసియా కప్‌లో వరుసగా బౌలింగ్ చేసిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ వికెట్లు పడగొట్టాడు. ఫైనల్స్‌లో లంకపై 3 పరుగులకే 3 వికెట్లు తీసి అదరగొట్టాడు. అయితే రానున్న ప్రపంచకప్‌లో హార్దిక్ బౌలింగ్ కంటే అతని బ్యాటింగే కీలకం. మిడిలార్డర్లో అతను ఫినిషర్‌గా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రపంచకప్‌లో పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలించే అవకాశమున్నందున జడేజా బౌలింగ్‌లో కీలకం కానున్నాడు. అయితే కొన్ని మ్యాచ్‌ల్లో అతను బ్యాటింగ్‌తోనూ జట్టును ఆదుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడచ్చు. ఇక ఆసియా కప్‌లో 6 వికెట్లతో ఫామ్ చాటిన అతను.. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో 3 వికెట్లతో అదరగొట్టాడు.
- ప్రస్తుత ప్రపంచకప్‌లో ఉన్న జట్లలో బంగ్లాదేశ్ చిన్నదే కానీ.. దాని కెప్టెన్ షకిబ్ అల్‌హసన్ మాత్రం పెద్ద స్థాయి ప్లేయరే. ప్రపంచ మేటి ఆల్‌రౌండర్లలో అతనికి ప్రత్యేక స్థానం ఉంది. వన్డేల్లో షకిబ్ బ్యాటింగ్, బౌలింగ్ సగటు వరుసగా 38, 29గా ఉండటాన్ని బట్టి అతడి స్థాయి ఏంటో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం పలుమార్లు భారత్‌లో పర్యటించడం అతడికి సానుకూలాంశంగా మారింది. అయితే బంగ్లా సెమీస్ చేరడం కష్టం కానీ.. ఈ టోర్నీలో షకిబ్ మాత్రం తనదైన ముద్ర వేయడం ఖాయం.
- ప్రస్తుతం ఉన్న ఆల్‌రౌండర్ల జాబితాలో అత్యంత ప్రమాదకరమైన ఆల్‌రౌండర్ అంటే అది లివింగ్‌స్టనే. వచ్చీ రాగానే భారీ షాట్లు ఆడటం అతడికి అలవాటే. క్రీజులో నిలదొక్కుకున్నాడంటే ఇక బౌలర్లకు చుక్కలు కనిపించి తీరుతాడు. వన్డేల్లో అతడి స్ట్రైక్ రేట్ 120కి, సగటు 40కి చేరువగా ఉన్నాయి. అంతే కాకుండా లివింగ్‌స్టన్ ఓ ఉపయుక్తమైన ఆఫ్‌స్పిన్నర్ కూడా. మరోవైపు మొయిన్ అలీ రూపంలో మరో మేటి ఆల్‌రౌండర్ ఇంగ్లాండ్ సొంతం. ఇక బెన్ స్టోక్స్ సంగతి చెప్పాల్సిన పని లేదు. కానీ ఈసారి అతను బౌలింగ్ చేయకపోవచ్చు.
- ఈ మధ్య సరైన ఫామ్‌లో లేడు కానీ.. పాకిస్థాన్ ఆటగాడు షాదాబ్ ఖాన్ కూడా మేటి ఆల్‌రౌండరే. పాక్ జట్టులో ఉత్తమ స్పిన్నర్‌గా రాణించిన అతను.. పరుగులు కట్టడి చేయడమే కాక.. తరచుగా వికెట్లు తీస్తాడు. బ్యాటింగ్‌లో ఆరంభం నుంచే చెలరేగిపోయి ఆడగలడు. అయితే ఇప్పుడు అతను అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోతున్నాడు. తాజాగా జరిగిన ఆసియాకప్‌లో రెండే వికెట్లు తీశాడు. అసలు రెండంకెల స్కోరే చేయలేదు. దీంతో రానున్న ప్రపంచకప్‌లోనైనా అతడు లయ అందుకుంటాడని పాక్ ఆశిస్తోంది.
- న్యూజిలాండ్ జట్టులోని రచిన్ రవీంద్ర, జిమ్మీ నీషమ్, డరైల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్.. ఇలా చాలామంది మేటి ఆల్‌రౌండర్లున్నారు. మిచెల్ అయితే టాప్ ఆర్డర్ బ్యాటర్లకు ఏమాత్రం తీసిపోడు. అతడు ఓ మెరుగైన పేసర్ కూడా. ఇక ఫిలిప్స్ విధ్వంసక బ్యాటింగ్‌లో మ్యాచ్ ఫలితాలనే మార్చేయగలడు. తన ఆఫ్‌స్పిన్ మాయాజాలంతో భారత పిచ్‌లపై ఎన్నో మ్యాజిక్‌లు సృష్టించగలడు. మరోవైపు ప్రధాన స్పిన్నర్లలో ఒకడైన రచిన్ టాప్‌ఆర్డర్లో కూడా బ్యాటింగ్ చేయగలడు. పాక్‌తో వార్మప్ మ్యాచ్‌లో అతను ఓపెనర్‌గా దిగి 97 పరుగులు చేయడం విశేషం. నీషమ్‌కు ఆల్‌రౌండర్‌గా సుదీర్ఘ అనుభవం ఉంది.
- ఆస్ట్రేలియా జట్టుకు సైతం ఆల్‌రౌండర్ల బలం బాగానే ఉంది. ఒకప్పుడు ప్రధానంగా బౌలింగే చేస్తూ.. అప్పుడప్పుడూ బ్యాటింగ్‌లో సత్తా చాటేవాడు స్టార్ క్రికెటర్ మిచెల్ మార్ష్. కానీ ఇప్పుడు అతను ప్రధాన బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు. టాప్‌ఆర్డర్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. భారత్‌తో చివరి వన్డేలో అతను 96 పరుగులు చేశాడు. అవసరాన్ని బట్టి మార్ష్ బౌలింగ్ కూడా చేస్తున్నాడు. స్టాయినిస్ మిడిలార్డర్లో విధ్వంసక ఇన్నింగ్స్‌ను ఆడతాడు. పేస్ బౌలింగ్‌లో 10 ఓవర్లు నిలకడగా బౌలింగ్ చేస్తాడు. లబుషేన్ సైతం ఉపయుక్తమైన స్పిన్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు.