మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. పాన్ ఇండియా ఫిల్మ్‌గా బుధవారం విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్లో 'వార్' చిత్రం ఇదే రోజు విడుదలవుతోంది. ఇందువల్ల ఈ హిందీ బాక్సాఫీసు వద్ద తీవ్రమైన పోటీ ఏర్పడనుంది. తాజాగా సైరా చిత్రంపై వార్ హీరో టైగర్‌ష్రాఫ్ మాట్లాడాడు. ప్రతి ఒక్కరికీ బాలీవుడ్లో మార్కెట్ ఉందని, రెండూ సినిమాలూ ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
"ఈ రోజుల్లో ప్రతి సినిమాకు కొంత మార్కెట్ ఉంది. ఏ చిత్రమైనా కచ్చితంగా బిజినెస్ చేస్తుంది. అందుకే మా సినిమా ఒక్కటే విడుదల కావాలని ఎవరిని అడగలేదు. రెండు చిత్రాలు ఘన విజయం సాధించాలి. సైరా చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్".
-టైగర్ ష్రాఫ్, బాలీవుడ్ హీరో.
స్టార్ హీరోలైన అమితాబ్ బచ్చన్, చిరంజీవికి తను పెద్ద అభిమానినని చెప్పాడు టైగర్ ష్రాఫ్.
"ఇద్దరు మెగాస్టార్లకు(అమితాబ్, చిరు) నేను పెద్ద అభిమానిని. నేను నటించిన వార్ సినిమా విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. కొంచెం కంగారుగా ఉంది. మొదటి సారి సినిమాను కుటుంబంతో కలిసి చూశా. హృతిక్ ఫ్యామిలీ కూడా మాతో కలిసి వీక్షించింది. చిత్రం చాలా బాగుందని ప్రశంసలు వచ్చాయి. అందరితో కలిసి చూడడం మంచి అనుభూతిని ఇచ్చింది".