బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘వార్’. భారీ బడ్జెట్, అంతకుమించిన భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మచ్చుతునకగా వచ్చిన టీజర్, ట్రైలర్ అదిరిపోయాయి. దీంతో సినిమా అంచనాలు రెండింతలయ్యాయి. అప్పట్నుంచి అభిమానులు సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు విడుదలైన చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది..? హృతిక్‌రోషన్, టైగర్ ష్రాఫ్ ‘వార్’తో మంచి విజయాన్ని అందుకున్నారా?
కథలోకి వెళ్తే...
సైనికాధికారి కబీర్ (హృతిక్) కొన్ని కారణాల వల్ల రెబల్‌గా మారతాడు. అతణ్ని మట్టుబెట్టడానికి మరో సైనికాధికారి ఖలీద్ (టైగర్) రంగంలోకి దిగుతాడు. ఖలీద్ గతంలో కబీర్ వద్దే యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకొని ఉంటాడు. అందుకే అతణ్ని గురువుగా భావిస్తుంటాడు. కానీ, గురువుతోనే తలపడాల్సిన పరిస్థితి వస్తుంది. కబీర్ రెబల్‌గా ఎందుకు మారాడు? కబీర్, ఖలీద్ ఎందుకు తలపడ్డారు? గురుశిష్యుల సమరంలో గెలిచిందెవరో తెరపైనే చూడాలి.
సినిమా ఎలా ఉందంటే..
యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో హృతిక్, టైగర్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వీరిద్దరి మధ్య చిత్రీకరించిన ఫైట్లు యాక్షన్ ప్రియులను మైమరిపిస్తాయి. ప్రథమార్ధంలోని కొన్ని ట్విస్ట్‌లు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తాయి. ద్వితీయార్ధంలో అసలు మలుపు తెలిసిపోయాక సినిమా అక్కణ్నుంచి సాదాసీదాగా అనిపిస్తుంది. దీంతో ప్రేక్షకుడికి ఇది రోటీన్ సినిమానే అనే భావన కలుగుతుంది. దర్శకుడు యాక్షన్ సన్నివేశాల మీద ఆసక్తి చూపించి.. కథ మీద అంతగా దృష్టి పెట్టలేదనిపిస్తోంది. వాణీ కపూర్ పాత్రను యాక్షన్ సన్నివేశాల మధ్య రిలీఫ్ కోసమే అన్నట్లుగా వాడుకున్నారు.