"వాస్తవ ఘటనలే నా కథా వస్తువులు. నా స్వభావమే నేను చేసే సినిమాల్లో కనిపిస్తుంది" అంటున్నారు యువ దర్శకుడు వేణు ఊడుగుల.'నీది నాది ఒకే కథ'తో ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. ప్రస్తుతం 'విరాటపర్వం' తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాతో సహా లాక్‌డౌన్, తదుపరి ప్రాజెక్టులపై పలు విశేషాలు పంచుకున్నారు వేణు.
'నీది నాది ఒకే కథ', 'విరాటపర్వం' రెండూ సామాజిక కోణంలో సాగుతున్నవే? ఇలాంటి కథలకే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.?
మాది వరంగల్ జిల్లా. అక్కడ నేను చూసిన మనుషులు, చదివిన పుస్తకాలు, పుట్టి పెరిగిన ఉద్యమ వాతావరణమే నాకో భిన్నమైన దారిని చూపించింది. ప్రేక్షకులకు నేనెలాంటి కథలను చెప్పాలో ఒక స్పష్టమైన అవగాహన ఇచ్చింది. నేను తీసే సినిమాలు ఆ స్పృహతోనే ఉంటాయి. అలా అని లోకాన్ని ఉద్ధరించాలని కాదు. నన్ను నేను అర్థం చేసుకోవడానికే సినిమాలు తీస్తున్నా.
మొదటి సినిమాకు, రెండో సినిమాకు మధ్యలో చాలా విరామం తీసుకున్నట్టున్నారు?
'విరాటపర్వం' సినిమా చిత్రీకరణ పూర్తవుతుందనుకున్న సమయంలో కరోనా అడ్డంకి వచ్చింది. అంతకు ముందు నటీనటులు అందుబాటులో లేకపోవడం వల్ల నాలుగు నెలల అంతరాయం కలిగింది. ఇది కావాలని తీసుకున్న గ్యాప్ కాదు. 10 రోజుల్లో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. ఈ సన్నివేశాల్ని మూడు వందల మందితో తెరకెక్కించాలి. కరోనా విజృంభిస్తున్న వేళ ఇది సాధ్యం కాదు. అందుకే సమయం కోసం ఎదురుచూస్తున్నాం.
'విరాటపర్వం' కథ ఎలా ఉండబోతోంది?
విప్లవం అనేది అమితమైన ప్రేమ నుంచి ఉద్భవిస్తుందని తెలియజెప్పే ఉద్విగ్నభరితమైన కథే 'విరాటపర్వం'. 1990ల్లోని ఒక రాజకీయ సందర్భాన్ని, వ్యక్తిగత సంఘర్షణగా వ్యాఖ్యానించడం జరుగుతోంది. ఇది ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా మనం బాగా ప్రేమించిన వ్యక్తి మరణంలా ఉంటుంది. ఇక సాయిపల్లవిని బెల్లి లలితగా చూపిస్తున్నట్లు నేనెక్కడా చెప్పలేదు. అది కేవలం అపోహే.
మహిళలు కీలక పాత్రలు పోషిస్తున్నారంటా!