అతడి పేరు మల్లెమాల సుందరరామిరెడ్డి. కానీ అందరికీ సహజకవి 'మల్లెమాల'గానే సుపరిచితుడు. క్రమశిక్షణకు మారుపేరు. స్వయంగా రైతు కుటుంబం నుంచి సినిమా రంగానికి వచ్చారు. ఆయన జీవితంలో కష్టాలున్నాయి, కన్నీళ్లున్నాయి, పలుగులున్నాయి, పారలున్నాయి, ఎత్తుపల్లాలున్నాయి, నిద్రకు నోచని రాత్రుళ్లున్నాయి. కానీ తన జీవితకాలంలో ఎవరికీ తలవంచలేదు. ముఖ్యంగా చలనచిత్రసీమలో అటువంటి నిర్మాతలుండడం అరుదే. గూడూరులో ఉండే తన సినిమాహాలు సామాగ్రి కోసం 1966లో మద్రాసు వెళ్లిన మల్లెమాల.... కామధేను థియేటర్‌లో 'కుమరిపెణ్ణ్' అనే ఒక తమిళ సినిమా చూసి 'కన్నెపిల్ల' పేరుతో ఆ సినిమాను డబ్ చేసి విజయం సాధించారు. అమెరికాలో ఉంటున్న తన ఏకైక కుమారుడు శ్యాంప్రసాదరెడ్డిని పిలిపించి, నిర్మాతగా చేసి 'తలంబ్రాలు', 'ఆహుతి', 'అంకుశం', 'ఆగ్రహం', 'అమ్మోరు', 'అంజి', 'అరుంధతి' వంటి సంసారపక్షంగా ఉండే విజయవంతమైన సినిమాలను నిర్మించారు. నేడు (మార్చి 9) శ్యాంప్రసాదరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం...
శ్యాంప్రసాద్ తొలిచిత్ర అనుభవం...
మల్లెమాల సుందరరామిరెడ్డికి నాటి కేంద్రమంత్రైన.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి సన్నిహితులు. మల్లెమాల 'కల్యాణవీణ' చిత్రం నిర్మిస్తున్న సమయంలో విజయభాస్కరరెడ్డి తన కుమార్తెను మల్లెమాల కుమారుడు శ్యాంప్రసాద్‌రెడ్డికి ఇచ్చి పెళ్లి చేద్దామని ప్రతిపాదించారు. అప్పుడు శ్యాంప్రసాద్ అమెరికాలో ఉన్నత చదువు చదువుతున్నాడు. శ్యాంప్రసాద్ ఆ అమ్మాయిని చూడకుండా తల్లిదండ్రుల మీది గౌరవంతో విజయభాస్కరరెడ్డి చిన్నమ్మాయి వరలక్ష్మిని 1983, నవంబరు 17న హైదరాబాద్‌లో పెళ్లాడాడు.
శ్యాంప్రసాద్ అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చదివి ఉండడం వల్ల మల్లెమాల అతడ్ని ఏదైనా పరిశ్రమ పెట్టమని సలహా ఇచ్చారు. పైగా సినిమా వ్యాపారం ఎప్పుడు ఎవర్ని ఎలా ముంచుతుందో ఊహించలేము. కావున సినిమా నిర్మాణం జోలికి వెళ్ళవద్దని సలహా ఇచ్చారు. కానీ శ్యాంప్రసాద్ ఆలోచనా విధానమే వేరు. 'లాభనష్టాలనేవి ప్రతి వ్యాపారంలో ఉండేవే. ప్రేక్షకులకు సరైన వినోదం అందించగలిగితే ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. పైగా కొన్ని వందలమందికి ఉపాధి కలిగించినవాళ్లమవుతాం' అంటూ 'భోజనప్రియులకు రుచికరమైన ఆహారం అందించగలిగితే ఖర్చుకు వెనకాడరు' అనే ఉపమానంతో మల్లెమాలకు నచ్చజెప్పి సినిమా నిర్మాణంవైపే మొగ్గుచూపాడు.
అప్పుడు మల్లెమాల... శ్యాంప్రసాద్‌ను అపార వ్యాపారానుభవం గల ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు దగ్గరకు తీసుకెళ్లారు. రామోజీరావు.. శ్యామ్‌తో మాట్లాడి సంతృప్తి చెంది అతనికి చిత్ర నిర్మాణమే సరైన ఉపాధి అని సలహా ఇచ్చారు. అయితే శ్యాంప్రసాద్ నిర్మించబోయే తొలి చిత్రాన్ని ఉషాకిరణ్ సంస్థ 'మయూరి ఫిలిమ్స్' ద్వారానే విడుదల చేయాల్సిందిగా మల్లెమాల కోరారు. అందుకు రామోజీరావు అంగీకరిస్తూ కొంత పెట్టుబడి అడ్వాన్స్‌గా కూడా ఇచ్చారు. అలా శ్యాంప్రసాదరెడ్డి నిర్మాతగా 'తలంబ్రాలు' చిత్రం నిర్మాణానికి సిద్ధమైంది. ఎం.ఎస్.ఆర్ట్ మూవీస్ పతాకం మీద కోడి రామకృష్ణ దర్శకత్వంలో 'తలంబ్రాలు' చిత్రం రూపుదిద్దుకుంది.
రాజశేఖర్, కల్యాణచక్రవర్తి, జీవిత ముఖ్య తారాగణంగా.. సత్యం సంగీత దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం 17-10-1987న విడుదలై ఘనవిజయం సాధించింది. కోడి రామకృష్ణ ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయాలని రాత్రింబవళ్లు శ్రమించి పట్టుదలతో కేవలం 27 రోజుల్లోనే చిత్రనిర్మాణం పూర్తి చేశారు. ముఖ్యంగా రాజశ్రీ రాసిన 'ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు, వేదన శ్రుతిగా రోదన లయగా సాగే గానమిది' అనే పాటను సుశీల ప్రేక్షకులు కంటతడిపెట్టేలా పాడారు. బాలు, సుశీల ఆలపించిన 'నిన్న నీవు నాకెంతో దూరం', 'ఓ దానవుడైన మానవుడా' పాటలు సాహిత్యపరంగా, సంగీత పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మల్లెమాల స్వయంగా రాసిన 'బుల్లిపాప కోరేది తల్లిపాలు, కన్నెపిల్ల కోరేది తలంబ్రాలు' అనే పాటను థీమ్ సాంగ్‌గా చిత్రీకరించారు. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు మద్రాసులో జరిపారు. ఈ చిత్రం ద్వారానే రాజశేఖర్-జీవిత ఆలుమగలయ్యారు.
ఆహుతి చిత్రంతో సుస్థిరం...
కోడి రామకృష్ణ-శ్యాంప్రసాద్ రెడ్డి కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో క్రేజ్ పెరిగింది. వీరిద్దరి కలయికలోనే రెండవ చిత్రం 'ఆహుతి' శ్రీకారం చుట్టుకుంది. 'ఈ ప్రశ్నకు బదులేది' సినిమా షూటింగ్లో ప్రతినాయకుడిగా నటించిన అడుసుమిల్లి జనార్దన ప్రసాద్ అనే నటుణ్ణి నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి చూశారు.
వెంటనే 'ఆహుతి' చిత్రంలో ప్రసాద్‌కు మంచి పాత్రను ఇచ్చారు. ఈ పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం వల్ల ప్రసాద్ 'ఆహుతి ప్రసాద్'గా స్థిరపడ్డాడు. 1987,డిసెంబర్ 3న ఈ చిత్రం విడుదలై సంచలనం సృష్టించింది. అత్యధిక కేంద్రాల్లో వందరోజులు ఆడింది.
శ్యాంప్రసాద్ హ్యాట్రిక్ చిత్రం అంకుశం...
వరుసగా రెండు సినిమాలు విజయవంతం కావడం వల్ల ఎం.ఎస్. ఆర్ట్ మూవీస్ సంస్థకు బాధ్యత పెరిగింది. దాంతో హ్యాట్రిక్ సాధించే ధ్యేయంతో శ్యాంప్రసాద్- కోడి రామకృష్ణ మంచి కథను ఎంపికచేసి 'అంకుశం' పేరుతో నిర్మాణం మొదలుపెట్టారు. ఇందులోనూ రాజశేఖర్-జీవితలే నాయకానాయికలు. రామిరెడ్డిని ప్రతినాయకుడిగా తీసుకున్నారు. ఈ సినిమా రాజశేఖర్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చి స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా 1989 జూన్ 13న విడుదలై కోడి రామకృష్ణ-శ్యాంప్రసాద్‌లకు నిజమైన హ్యాట్రిక్ విజయాన్ని అందించింది.