పూర్వాశ్రమంలో అంటే 1969లో సూపర్‌స్టార్ రజనీకాంత్.. బెంగళూరు శ్రీనగర్-మెజేస్టిక్ రూట్ సిటీ బస్సులో కండక్టర్. ఆ బస్‌కు డ్రైవర్ రాజబహదూర్. ఇద్దరి మధ్య స్నేహబంధం రెక్కలు తొడిగింది. రాజబహదూర్ ప్రోత్సాహంతో రజనీ బి.టి.ఎస్ (బెంగుళూరు ట్రాన్స్ పోర్ట్ సర్వీస్) నాటకరంగ కళాకారుల బృందంలో చేరి పౌరాణిక నాటకాల్లో కర్ణుడు, దుర్యోధనుడు లాంటి పాత్రలు పోషిస్తూ పేరు తెచ్చుకున్నారు. రజనీ నటనలో ఉన్న ప్రత్యేక శైలిని చూసి రాజబహదూర్ సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పడానికి ఇష్టపడని రజనీని రాజబహదూర్ ఒప్పించారు. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకపోతే తనకున్న పాల డెయిరీలో పనిచేయవచ్చని ధైర్యం చెప్పారు.
అలా రజనీ యాక్టింగ్ స్కూల్‌లో చేరారు. రాజబహదూర్, నెలకు రెండు వందలు రజనీకి మనీ ఆర్డర్ చేసేవారు. ఎప్పుడైనా డబ్బులు పంపలేకపోతే ఉపయోగపడేందుకు తన బంగారు గొలుసు రజనీ చేతిలో పెట్టారు. రజనీ దశ తిరిగి బాలచందర్ చేతిలో పడ్డారు. అపూర్వ రాగంగళ్, మూన్రాం ముడిచ్చు వంటి ప్రయోగాత్మక సినిమాలతో స్టార్‌డమ్‌ను అందుకున్నారు.
ఎంత ఎదిగినా తనను ప్రోత్సహించి, డబ్బు పంపి ఆదుకున్న రాజబహదూర్‌ను మాత్రం రజనీ మరవలేదు. తరచూ బెంగళూరు వెళతారు. రాజబహదూర్‌తో కలిసి విద్యార్థి భవన్‌లో నేతి దోశలు కట్టించుకుని ఎంచక్కా కృష్ణారావు పార్కులో కూర్చొని ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తింటారు. ఇద్దరూ ఎం.జి.రోడ్డు, బ్రిగేడ్ రోడ్లవెంట పబ్లిక్‌గా తిరుగుతారు. ఎక్కడంటే అక్కడ కూర్చొని కబుర్లాడుకుంటూ, జోకులు పేల్చుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అయితే అంతపెద్ద సూపర్ స్టార్ అంత పబ్లిక్‌గా తిరగడం ఎలా సాధ్యం అనే ప్రశ్న మనకు రాకమానదు.