కరోనా వైరస్, లాక్‌డౌన్ సమయంలో వేలమందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు నటుడు సోనూసూద్. లాక్‌డౌన్ ఆంక్షలు దాదాపుగా సడలిపోయినా ఇప్పటికీ ఆయన నుంచి ఎవరో ఒకరు సాయం పొందుతూనే ఉన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయనకు అర్జీ పెట్టుకోవడమే ఆలస్యం తన చేతనైనంత సాయం చేస్తున్నారు. తాజాగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమైన 39మంది చిన్నారుల కోసం ఫిలిప్సీన్స్ నుంచి దిల్లీకి ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు.
లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న 39 మంది చిన్నారులకు.. దిల్లీలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. అయితే, వారంతా ఇక్కడకు వచ్చి వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా సోనూసూద్‌కు విన్నవించగా.. "ఈ అమూల్యమైన జీవితాలను కాపాడుదాం. మరో రెండు రోజుల్లో వాళ్లు ఇండియాకు వస్తారు. 39 ఏంజెల్స్ మీరు మీ బ్యాగ్‌లు సర్దుకోండి" అని సోనూ సమాధానం ఇచ్చారు. దీంతో మరోసారి సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు ఆయన సాయాన్ని ప్రశంసిస్తున్నారు.