ప్రముఖ నటుడు సోనూసూద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనను ఐక్యరాజ్య సమితి అవార్డు వరించింది. ఐరాస అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఎస్‌డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డును ప్రకటించింది. కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్ కాలంలో లక్షలాది వలస కార్మికులు, విద్యార్థులకు సేవలందించినందుకు ఆయన ఈ గౌరవానికి ఎన్నికయ్యారు. ఈ అవార్డును ఓ వర్చువల్ కార్యక్రమంలో సోమవారం సాయంత్రం ఆయనకు ప్రదానం చేశారు. తద్వారా ఐరాస అవార్డును అందుకున్నఏంజెలినా జోలీ, డేవిడ్ బెక్‌హామ్, లియోనార్డో డి కాప్రియో, ప్రియాంకా చోప్రా తదితర సినీ ప్రముఖుల జాబితాలో సోను చేరారు.
"ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. ఇది ఓ అరుదైన గౌరవం. ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందటం చాలా ప్రత్యేకం. నా దేశ ప్రజలకు నేను చేయగలిగిన కొద్దిపాటి సహాయాన్ని, నాకు వీలయిన విధంగా, ఏ ప్రయోజనం ఆశించకుండా చేశా. అయితే నా చర్యలను గుర్తించి, అవార్డు అందించటం చాలా ఆనందంగా ఉంది. యూఎన్‌డీపీ తన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ) చేరుకునేందుకు నా పూర్తి సహకారం ఉంటుంది. సంస్థ చర్యల వల్ల మానవాళికి, పర్యావరణానికి అమితమైన మేలు చేకూరుతుంది" అని అన్నారు.