కరోనా ప్రభావంతో వివిధ రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. అందులో సినీ రంగం ఒకటి. విదేశాల్లో జరగాల్సిన షూటింగ్‌లను ప్రస్తుతం వాయిదా వేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పుడు నాని 'వి' సినిమా విడుదలకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
నేచురల్ స్టార్ నాని 'వి' సినిమా వాయిదా!
కరోనా సెగ ప్రపంచ వ్యాప్తంగా సినీపరిశ్రమలను కుదిపేస్తోంది. ఇప్పటికే పలు చిత్రాలు విడుదలను వాయిదా వేసుకోగా.. తాజాగా ఆ జాబితాలో టాలీవుడ్ చేరే పరిస్థితి కనిపిస్తోంది. మూవీ షూటింగ్‌లు సజావుగానే సాగుతున్నా.. ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సమయం తీసుకోనున్నారు దర్శకనిర్మాతలు. తాజాగా నాని నటించిన 'వి' సినిమా కూడా వాయిదా పడనుందని సమాచారం.
నాని-సుధీర్‌బాబు నటిస్తున్న 'వి' సినిమాను తొలుత ఈనెల 25న ఉగాది కానుకగా విడుదల చేయాలనుకున్నారు. అదే సమయంలో ఆంధ్రాలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటం, ఆ వెంటనే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనుండటం వల్ల కాస్త ఆలస్యంగా విడుదల చేద్దామని చిత్రబృందం అనుకుంది. అయితే ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు తగ్గే అవకాశముంది! ఈ నేపథ్యంలో 'వి' సినిమాను వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిత్రాన్ని ఏప్రిల్ మూడు లేదా నాలుగో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.