సినిమా చిత్రీకరణలకు ఎట్టకేలకు అనుమతులు లభించాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు చేసుకోవచ్చని ఇదివరకే చెప్పిన తెలంగాణ ప్రభుత్వం చిత్రీకరణలకూ పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ అనుమతులిచ్చేసింది. దాంతో దాదాపు రెండున్నర నెలలుగా స్తంభించిపోయిన చిత్రసీమ... తిరిగి పనులు ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. అయితే అనుమతులొచ్చాయన్న ఆనందం కంటే... పరిమితుల మధ్య చిత్రీకరణలు చేసుకోవాల్సి రావడం దర్శక నిర్మాతల్ని, నటుల్ని, సాంకేతిక బృందాల్ని ఆలోచనలో పడేసింది. కొవిడ్-19 నిబంధనల్ని, చిత్రీకరణల కోసం సూచించిన మార్గదర్శకాలను పాటిస్తూ షూటింగ్‌లు చేయడం అంత ఆషామాషీ కాదనేది వారి మాట. ఈ పరిమితులకు భయపడే చాలామంది చిత్రీకరణల విషయంలో వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నారు.
లాక్డౌన్లో టాలీవుడ్లో సినిమా షూటింగ్‌లు తొలి అడుగు 'ఆర్‌ఆర్‌ఆర్'దేనా?
ఎవరైనా తొలి అడుగు వేశాక, అక్కడ ఎదురయ్యే సాధకబాధకాల్ని... సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి ఆ తర్వాత రంగంలోకి దిగాలనే యోచనలో ఉన్నారు ఎక్కువమంది దర్శక నిర్మాతలు. భారీబడ్జెట్ సినిమాల్లో 'ఆర్‌ఆర్‌ఆర్', 'ఆచార్య' తొలుత మొదలయ్యే అవకాశాలున్నాయి. మొదట రాజమౌళి, కొరటాల శివ ట్రయల్ షూట్ చేసి, సెట్‌లో పాటించే నిబంధనల గురించి ప్రభుత్వానికి చూపించాలనుకున్నారు. కానీ ప్రభుత్వం సెట్‌లో భద్రతకు సంబంధించిన బాధ్యతల్ని దర్శకనిర్మాతలకి అప్పజెబుతూ, పాటించాల్సిన మార్గదర్శకాలతో చిత్రీకరణలకు అనుమతులిచ్చింది.
'షూటింగ్‌కు వెళ్లకుండా ఇక ఆగలేను. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సిద్ధమైపోదాం' -దర్శకుడు రాజమౌళి
అయినా కొన్నే...
అనుమతులు వచ్చినా తక్కువ చిత్రాలే పట్టాలెక్కుతాయని పరిశ్రమ వర్గాల మాట. చిత్రీకరణ తుదిదశలో ఉన్న సినిమాలే మొదలవుతాయని, మిగిలిన సినిమాలు జులై15 తర్వాతే ప్రారంభం అయ్యే అవకాశాలే ఎక్కువని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ అధినేత తెలిపారు. ప్రస్తుతం కరోనా ప్రభావం దృష్ట్యా కొందరు నటులు బయటికి రావడానికి ఆసక్తి చూపడంలేదని మరో నిర్మాత తెలిపారు. మరికొందరి ఆలోచన తీరు వేరేగా ఉంది. షూటింగ్ అయిన భాగానికి నిర్మాణానంతర పనులు పూర్తిచేసి థియేటర్లు తెరవడానికి కొంతకాలం ముందు షూటింగ్ చేసుకుంటే సరిపోతుందని భావిస్తున్నారు.
"కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితుల మధ్య చిత్రీకరణలకు వెళ్లడం కష్టమే. మా సంస్థలో సినిమాలు మొదలు కావడానికి ఇంకా సమయం పడుతుంది" - ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు
పొరుగు పరిశ్రమల్ని గమనిస్తూ..
సెట్ వరకు వెళ్లేందుకు చేయాల్సిన ప్రయాణాల దగ్గర్నుంచి, సెట్‌లో మసలుకోవాల్సిన తీరు, లొకేషన్లు, నటీనటుల ఎంపిక, మేకప్ - కాస్ట్యూమ్స్ వరకు అడుగడుగునా జాగ్రత్తలు తీసుకోవాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. స్వేచ్ఛగా వెళ్లి, అందరూ కలిసి చిత్రీకరణలు పూర్తి చేసుకుని వచ్చే సినీ బృందాలకి ఇప్పుడు అడుగు తీసి అడుగేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పక్కా ప్రణాళికలతో వెళ్లినా ఒక్కోసారి సన్నివేశాన్ని అనుకున్నట్టుగా పూర్తి చేయలేరు. అలాంటిది కెమెరా ముందుకు వెళ్లడానికి ముందే ఇన్నిసవాళ్లను అధిగమించడం ఎలా అనేది పరిశ్రమ వర్గాల ప్రశ్న. కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో ఇప్పటికే చిత్రీకరణలు మొదలయ్యాయి. అక్కడ ఎలా చేస్తున్నారనే విషయంపై చిత్ర పరిశ్రమ దృష్టి సారించింది.
"పక్క రాష్ట్రాల్లో ఎలాంటి మార్గదర్శకాలతో పనిచేస్తున్నారో మేం అంతర్జాలంలో శోధించి తెలుసుకుంటూనే ఉన్నాం. మనం ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచిస్తున్నాం"- శ్రీరామ్ వేణు, వకీల్‌సాబ్, దర్శకుడు
ఇవీ చదవండి: