ఏడు దశాబ్దాల టాలీవుడ్ చరిత్రలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. అందులో ఎన్నో జోడీలు.. సినీ ప్రేమికుల మదిలో చిరకాలం నిలిచిపోయాయి. అందులో ప్రధానంగా చిరంజీవి-శ్రీదేవి, చిరంజీవి-విజయశాంతి, నాగార్జున-టబు, వెంకటేశ్-సిమ్రాన్ జంటలు తెలుగు ప్రేక్షకులను మరింతగా అలరించాయి. మంచి కెమిస్ట్రీతో సినిమాలోని సన్నివేశాల్లో చక్కటి భావోద్వేగాలను పలికించారు. చూసే వీక్షకులకు వారు నిజంగానే ప్రేమలో పడ్డారా? అనే సందేహం వచ్చేంతలా ఆ పాత్రల్లో లీనమైపోయారు. అలాంటి కొన్ని జోడీల గురించే ఈ కథనం.
చిరంజీవి-శ్రీదేవి
మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి తొలిసారి కలిసి నటించిన చిత్రం 'రాణికాసుల రంగమ్మ'. 1981లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో 'ఎస్పీ పరశురామ్', 'జగదేకవీరుడు అతిలోకసుందరి' లాంటి చిత్రాల్లో కలిసి నటించారు. అద్భుతంగా కెమిస్ట్రీ పండించారు. 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చిత్రంలో చిరంజీవి, శ్రీదేవిల పాత్రలను ఇప్పటికీ మర్చిపోలేరంటేనే మీరు అర్ధం చేసుకోవచ్చు.
నాగార్జున - టబు
నాగార్జున, టబు కలిసి నటించిన చిత్రం 'నిన్నే పెళ్లాడతా'. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. 1996లో వచ్చిన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకోవడం సహా నాగార్జున కెరీర్లో క్లాసికల్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో నాగ్, టబు మధ్య జరిగే రొమాంటిక్ సన్నివేశాలు వీక్షకుల్ని కట్టిపడేశాయి. ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డు, ఫిలింఫేర్ అవార్డులను 'నిన్నే పెళ్లాడతా' దక్కించుకుంది.