"ఒక పాట ప్రేక్షకుల్ని థియేటర్లకి తీసుకొస్తుందనే విషయాన్ని చాలా ఇష్టపడతా. సినిమాకి నా పాట ప్రధాన ఆకర్షణగా నిలిచిందంటే ఒక సంగీత దర్శకుడిగా నాకు అంతకంటే ఏం కావాలి?" అంటున్నారు అనూప్ రూబెన్స్. ఆయన స్వరాలు సమకూర్చిన చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్ జంటగా నటించారు. మున్నా దర్శకుడు. ఎస్.వి.బాబు నిర్మాత. ఈ నెల 29న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు అనూప్ రూబెన్స్. ఆ విషయాలివీ..
"పాటంత బాగుంటుంది సినిమా అనే శీర్షికతో మా సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుండడం ఎంతో సంతృప్తినిస్తోంది. 'నీలి నీలి ఆకాశం..' పాట బాణీనీ దర్శకుడు చెప్పిన సందర్భం, అందులోని భావోద్వేగాలు ఇచ్చిన స్ఫూర్తితోనే సమకూర్చా. సామాజిక మాధ్యమాల వల్ల ఒక పాట ఇంతగా శ్రోతలకి చేరువవుతుందని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ సినిమా కోసం నేను కట్టిన తొలి బాణీ.. 'నీలి నీలి ఆకాశమే'. రెండు రకాల బాణీలు చేసి వినిపించాను కానీ.. మా బృందంలో అందరూ నీలి నీలినే బాగుందని చెప్పారు. నాకు గీత రచయిత చంద్రబోస్ అంటే ఇష్టం. ఈ బాణీ సిద్ధమయ్యాక ఆయనే గుర్తుకొచ్చారు. ఆయన హృదయాల్ని హత్తుకునేలా పాట ఇచ్చారు. చంద్రబోస్ నాలుగు పాటలు, అనంత శ్రీరామ్ ఒక పాట, నేను, ప్రదీప్ కలిసి ఓ పాట రాశాం".