తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ హీరోల గురించి సాయి పల్లవి ఏమందంటే..?

మలయాళ చిత్రం 'ప్రేమమ్​'తో కుర్రకారు మనసును దోచేసింది. టాలీవుడ్​లో వరుణ్​తేజ్​ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులనూ 'ఫిదా' చేసిందీ భామ. అలా అతికొద్ది సమయంలోనే అందంతోపాటు అభినయంతోనూ స్టార్​డమ్​ను సొంతం చేసుకుంది సాయిపల్లవి. అయితే చిత్రపరిశ్రమలో తాను హీరోయిన్​గా రాణించడానికి ఆమెతో నటించిన హీరోలే కారణమంటోంది. ఆ విషయాలేంటో సాయిపల్లవి మాటల్లోనే తెలుసుకుందాం.

Actress Sai Pallavi about her heroes
ఆ హీరోల గురించి సాయి పల్లవి ఏమందంటే..

By

Published : Jan 31, 2021, 5:09 PM IST

స్వస్థలం ఊటీ అయినా.. తెలుగులో తన నటనతో అభిమానుల్ని 'ఫిదా' చేసిన హీరోయిన్‌ సాయి పల్లవి. త్వరలో 'లవ్‌స్టోరీ'తో మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించనున్న ఈ సొగసరి తనతో తెరను పంచుకున్న హీరోల గురించి చెబుతోందిలా..

టెన్షన్‌ పోగొట్టేవాడు

ధనుష్​

ధనుష్‌.. జాతీయస్థాయిలో అవార్డు తెచ్చుకున్న హీరో అయినా అతనిలో ఆ గర్వం కనిపించదు. 'మారి 2' చేస్తున్నప్పుడు వీలైనంత తక్కువ టేకులు తీసుకోవాలనుకునేదాన్ని. దాంతో కాస్త టెన్షన్‌ పడేదాన్ని. అది గుర్తించి ఏవో జోకులు చెప్పేవాడు. నేను ఒక్కసారిగా నవ్వితే ఆ టెన్షన్‌ అంతా పోయేది. అయితే.. సెట్‌లో ధనుష్‌ ఎంత సరదాగా ఉన్నా కెమెరా ముందు మాత్రం చాలా సీరియస్‌గా- 'మారి'లానే కనిపించేవాడు. అతను చెప్పిన మెలకువలు పాటించి నన్ను నేను తెరమీద చూసుకున్నప్పుడు నేనేనా ఇంత బాగా చేసిందని అనుకున్నా. 'మారి 2'లో నా నటనకు మంచి మార్కులు పడ్డాయంటే దానికి కారణం ధనుష్‌.

నటనలో సూపర్‌

వరుణ్​తేజ్​

తెలుగులో నా మొదటి హీరో.. వరుణ్‌తేజ్‌ ఎప్పుడూ స్పెషలే. నేనేమో 5.4 అయితే.. వరుణ్‌ 6.4. దాంతో మేమిద్దరం కలిసి నటించే సీన్లలో తప్పనిసరిగా హీల్స్‌ వేసుకునేదాన్ని. ఇక, సెట్‌మీద చాలా సరదాగా నటించినట్లు కనిపించేవాడు. తీరా మానిటర్‌మీద చూస్తే, అతని భావాలు వ్యక్తం చేసిన తీరూ.. నటించిన విధానం వేరేలా ఉండేది. షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులూ... ఇంటికెళ్లాక మా అమ్మకు ఇదే విషయాన్ని పదే పదే చెప్పేదాన్నంటే నమ్మండి. అతని నటన చూసి ఎంతో నేర్చుకున్నా. ఒక్కమాటలో చెప్పాలంటే 'ఫిదా'తో నేను వరుణ్‌ నటనకు ఫిదా అయ్యా.

నా కల నెరవేరింది

సూర్య

చిన్నప్పటి నుంచీ నేను హీరో సూర్యకు పెద్ద అభిమానిని. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగా. సినిమాల్లోకి రాకముందు జీవితంలో ఒక్కసారైనా సూర్యను చూసే అవకాశం వస్తుందా అనుకునేదాన్ని. కానీ నేను ఊహించకుండానే 'ఎన్‌జీకే'లో కలిసి నటించా. సెట్‌లో ఓ వైపు నా సీన్‌లను నేను ప్రాక్టీస్‌ చేసుకుంటూనే.. మరోవైపు సూర్య ఎక్కడ ఉన్నారూ.. ఎలా నటిస్తున్నారూ.. తన సీన్‌ అయిపోయాక ఏం చేస్తున్నారూ.. ఇలా అన్నీ గమనించేదాన్ని. కానీ సూర్య మాత్రం చాలా మామూలుగానే వ్యవహరించేవారు. అప్పుడప్పుడూ 'కంగారు పడకు, నీకు వందశాతం సంతృప్తిగా అనిపించేవరకూ ఆ సీన్‌ మళ్లీమళ్లీ చేయడానికి వెనుకాడకు.. ఎన్ని టేకులైనా తీసుకో..' అని చెప్పేవారు. మొత్తానికి నా కల నెరవేరింది.

పాత్రల్లో జీవించేవాళ్లం..

శర్వానంద్​

శర్వానంద్‌.. ఓ నటిగా నన్ను నేను మెరుగుపరచుకోవడానికి ఎంతో తోడ్పడ్డాడు. నన్ను పొగుడుతూనే సహజంగా నటించేలా సహకరించాడు. నిజానికి 'పడిపడి లేచే మనసు' షూటింగ్‌ సెట్లో మేమిద్దరం ఆ పాత్రల పేర్లతోనే పిలుచుకునేవాళ్లం. ఏ సీన్‌ ఎలా నటించాలీ, ఎలా చేస్తే బాగుంటుందనీ తరచూ చర్చించుకునేవాళ్లం. షూటింగ్‌ విరామంలోనూ మధ్యమధ్య కొన్ని సీన్లు యథాలాపంగా చేయడం వల్ల దర్శకుడు వాటినీ చిత్రీకరించేవారు. షూటింగ్‌ విషయం పక్కన పెడితే.. ఈ సినిమా నాకో మంచి ఫ్రెండ్‌ని ఇచ్చిందని గర్వంగా చెబుతా.

కష్టపడి పనిచేస్తాడు..

నాని

ఒక సీన్‌ని ఎంత బాగా చేయాలో నానికి బాగా తెలుసు. 'ఎంసీఏ' చేస్తున్నప్పుడు అతనిలోని కష్టపడేతత్వం చూసి ఆశ్చర్యపోయా. తన ముందు సీన్‌ పేపరు ఉంటే కేవలం డైలాగుల్ని ప్రాక్టీస్‌ చేసుకోవడమే కాదు.. ఆ సీన్‌ని ఎలా చేయాలనే విషయంపైనా దృష్టి పెట్టేవాడు. సినిమా రంగంలోని చాలా విషయాల్లో అతనికి మంచి అనుభవం ఉంది. అవన్నీ చూసినప్పుడు ఓ మంచి డైరెక్టర్‌గానూ గుర్తింపు తెచ్చుకోగలడని అనిపిస్తుంది.

ఇదీ చూడండి:బాలయ్య నయా లుక్​.. 'బీబీ3' రిలీజ్​ డేట్​ ఫిక్స్​

ABOUT THE AUTHOR

...view details