"హీరో కామెడీ చేయడం వేరు, హాస్య నటుడు కామెడీ చేయడం వేరు. ఏదేమైనా గుర్తుండిపోయే కామెడీనే అత్యుత్తమమైనది. హీరోగా అలా గుర్తుండిపోయే పాత్రలు ఎన్నెన్నో చేశాను. క్యారెక్టర్ నటుడయ్యాక కూడా హాస్యం పండించడం తప్పలేదు. అయితే ఈ దశను మరింతగా ఆస్వాదిస్తున్నా" నని అంటున్నాడు నటుడు రాజేంద్రప్రసాద్.
ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'తోలుబొమ్మలాట'. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించాడు. చిత్ర విశేషాలను పంచుకున్నాడు.
- సోడాల రాజు కథే 'తోలుబొమ్మలాట'
"తోలుబొమ్మలాట అంటే మనుషులు ఆడే ఆట అని అర్థం. మనం తోలు ఉన్న బొమ్మలాంటి వాళ్లం.. మనల్ని అక్కడెవరో ఆడిస్తున్నారు కాబట్టి ఇదంతా 'తోలుబొమ్మలాట' అయింది. ఎవరెలా ఆడిస్తున్నా... జీవితాన్ని మనం అనుకున్నట్టుగా గడపాలి. అనుకోకుండా కొన్ని సమస్యలు వచ్చి పడుతుంటాయి. అలాంటివాటిని ఎదుర్కొంటూ జీవితాన్ని గడపాలి. ఆ నేపథ్యంలో సాగే చిత్రమే ఇది. ఇందులో సోడాల రాజుగా కనిపిస్తా. ఊళ్లో ఒక గౌరవం ఉన్న వ్యక్తి సోడాల రాజు. ఆయన కుటుంబంలో ఏం జరిగింది? చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా మారాయి? ఆ సమయంలో ఏం చేశాడన్నది తెరపైనే చూడాలి" -రాజేంద్ర ప్రసాద్, నటుడు
- పుట్టుకతో వృద్ధుడివా అంటూ ఆట పట్టించా
"దర్శకుడు విశ్వనాథ్ మాగంటి చాలా చిన్న కుర్రాడు. తను వచ్చి మీ స్టైల్ కథ ఉందని చెప్పాడు. నా స్టైల్ కథ, అది కుర్రాడు చెప్తానంటున్నాడంటే అల్లరి పనులు చేసే 'లేడీస్ టైలర్' తరహా పాత్ర చెబుతాడేమో అనుకున్నా. కానీ 'తోలుబొమ్మలాట' కథ చెప్పి ఆశ్చర్యపరిచాడు. పుట్టుకతోనే నువ్వు వృద్ధుడివా, ఇలాంటి కథ చెప్పావని సరదాగా ఆటపట్టించా. అంత పరిణతితో కూడిన కథ ఇది." -రాజేంద్ర ప్రసాద్, నటుడు
- ప్రతి పాత్రను సవాలుగానే తీసుకుంటా