పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, డెయిరీలు రాజకీయ జోక్యంతో దెబ్బతింటున్నాయి. పాడి రైతుల ఆదాయం పెరగడానికి అత్యంత కీలకమైన ఈ సంఘాలు, డెయిరీలు- గుజరాత్, కర్ణాటకల్లో ప్రగతిపథంలో వెలుగుతుంటే, తెలుగు రాష్ట్రాల్లో వెలవెలబోతున్నాయి. ఏళ్ల తరబడి పాల సంఘాలు, డెయిరీల పట్ల అనుసరించే విధానాలను ఇష్టారీతిగా మార్చేయడం వల్ల అవి ఎదుగుబొదుగు లేకుండా కునారిల్లుతున్నాయి. ఏపీలో 'విజయ'తో సహా ఇతర సహకార డెయిరీల నిర్వహణను గుజరాత్‌కు చెందిన అమూల్ డెయిరీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. తెలంగాణలో అతి తక్కువ మార్కెట్ వాటా ఉన్న విజయ డెయిరీకి పాలు దొరక్క నిత్యం కర్ణాటక సహకార డెయిరీ నుంచి వేల లీటర్లను కొంటోంది. గుజరాత్, కర్ణాటక మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో సహకార డెయిరీలు ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.
పాడి రైతులే సభ్యులు
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అమూల్ సహకార డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా రూపీందర్ సింగ్ సోధి 2010 నుంచి పనిచేస్తున్నారు. 2009-10లో డెయిరీ వార్షిక టర్నోవర్ తొమ్మిది వేల కోట్ల రూపాయలు. సోధి పదేళ్ల వ్యవధిలో ఆదాయాన్ని రూ.40 వేల కోట్లకు చేర్చారు. దేశంలోనే పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్ బంగ, మహారాష్ట్ర, రాజస్థాన్‌లోని సహకార డెయిరీలను కూడా అమూల్‌తో కలిసి పనిచేసేలా అమూల్ వ్యాపారాన్ని ఆయన వ్యూహాత్మకంగా విస్తరింపజేశారు. ఇప్పుడిక విజయ డెయిరీని ఏపీలో నడిపించే అధికారం సైతం అమూల్ తరఫున ఆయన చేతుల్లోకే వెళుతోంది.
ఒకవేళ ఇప్పుడు ఏపీలో విజయ డెయిరీ వ్యాపారం పెరిగినా అది అమూల్ విజయపరంపరలో భాగంగానే దేశం మొత్తం చెప్పుకొంటుందే తప్ప- ఏపీ సహకార పాల సంఘాల ప్రతిభగా ఎవరూ గుర్తించరు. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలంటే ప్రభుత్వ ప్రమేయం ఎక్కడా ఉండకూడదు. ఈ సంఘాల్లోని సభ్యులైన పాడి రైతులు నిత్యం అందించే పాలతో సహకార డెయిరీలు నడుస్తాయి. ఈ సంఘాల పాలక వర్గాల్లో పాడి రైతులే సభ్యులుగా ఉండాలి. వారే పాల ఉత్పత్తి పెంపు, పాడి పశువులు, సంఘాలు, డెయిరీల నిర్వహణపై విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎక్కడా ప్రభుత్వ అధికారుల జోక్యం ఉండకూడదని సంఘాల ఏర్పాటు లక్ష్యాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అది సాధ్యం కాక సహకార డెయిరీలు పూర్తిగా విఫలమవుతున్నాయి.
ప్రపంచంలోనే అగ్రస్థానం
ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశం 18.77 కోట్ల టన్నులతో, ప్రపంచ ఉత్పత్తిలో 20.17 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. 2019-20లో భారతీయులకు రోజూ తలసరి పాల లభ్యత 394 గ్రాములని కేంద్రం తాజా నివేదికలో ప్రకటించింది. కానీ 30శాతం పాలు మాత్రమే సంఘటిత రంగంలోని డెయిరీల ద్వారా విక్రయిస్తున్నందు వల్ల రైతులకు ఆదాయం పెరగడం లేదు. ఉదాహరణకు తెలంగాణలో నిత్యం 69 లక్షల లీటర్ల పాలు వినియోగమవుతుండగా ఇందులో 3.50 లక్షల లీటర్ల పాలు మాత్రమే ‘రాష్ట్ర సహకార పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ)’ విక్రయిస్తోంది. రాష్ట్రంలోని సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాలన్నింటికీ సమాఖ్యగా ఉన్న ఈ డెయిరీ మార్కెట్ వాటాయే నాలుగు శాతం ఉంటే ఇక పాడి రైతులకు ఆదాయాన్ని ఎలా పెంచగలుగుతుంది? కర్ణాటక రాష్ట్ర పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య 60 లక్షలు, అమూల్ డెయిరీ 50 లక్షల లీటర్ల పాలను రోజూ గరిష్ఠంగా సేకరిస్తున్నాయి.
ఇతరులపై ఆధారం
ఉమ్మడి ఏపీలో చాలా ప్రాంతాల్లో విజయ డెయిరీకి ఆస్తులు, ప్లాంట్లు ఉండేవి. కానీ ఆ తరవాత జిల్లావారీగా ఉన్న డెయిరీలు ఎక్కడికక్కడ స్వతంత్రత ప్రకటించుకుని కంపెనీ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. అవన్నీ విజయ డెయిరీ ఆస్తులే. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్‌కు ముఖ్యకార్యదర్శిగా సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌ప్రకాష్ 2011-12 ప్రాంతంలో ఉమ్మడి ఏపీ విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 'మిల్క్ మిషన్' పేరుతో రూ.6,500 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించారు. అప్పుడే విజయ డెయిరీ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుని సంస్థను పటిష్ఠం చేసి, పాడి రైతుల ఆదాయాన్ని పెంచాలనీ ఆయన ప్రయత్నించారు. అంతలోనే ఆయనకు విజయ డెయిరీ నుంచి బదిలీ కావడంతో లక్ష్యాలన్నీ పక్కకుపోయాయి.
ఆసక్తిలేని అధికారుల పాలన