సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్, సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్‌లలో ఉపయోగించే వార్తలకుగాను సంబంధిత వార్తాసంస్థలకు తగిన సొమ్ము చెల్లించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం చేయడం సంచలనంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వార్తాసంస్థలు ఎన్నో వ్యయప్రయాసలు, కష్టనష్టాలకోర్చి సేకరించిన సమాచారాన్ని ఫేస్‌బుక్, గూగుల్, యూట్యూబ్ వంటి సంస్థలు యథేచ్ఛగా వాడుకుంటున్నాయి. వాటి వీక్షణల సంఖ్య ఆధారంగా డిజిటల్ ప్రకటనల రూపంలో కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఆ సంపాదనలో వార్తాసంస్థలకు పెద్దగా వాటా ఇవ్వడం లేదని, ఇచ్చినచోటా ఏదో నామమాత్రంగా సరిపెడుతున్నాయన్న నిష్ఠుర సత్యాన్ని ఈ చట్టం వెలుగులోకి తెచ్చింది. వార్తాసంస్థలకు ప్రకటనల ఆదాయంలో సముచిత వాటా ఇవ్వాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం బిల్లు తీసుకురాగానే తొలుత ఫేస్‌బుక్, గూగుల్ ససేమిరా అన్నాయి. అవసరమైతే ఆస్ట్రేలియాలో తమ సెర్చింజన్‌ను ఆపేస్తామని గూగుల్ ప్రకటించింది. కానీ ప్రభుత్వం పట్టు వీడకపోవడంతో, వార్తలు వాడుకున్నందుకు సొమ్ము చెల్లించే దిశగా ఆస్ట్రేలియాకు చెందిన పలు వార్తాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫేస్‌బుక్ మాత్రం ప్రభుత్వ ప్రకటనను తోసిరాజంది. ఆస్ట్రేలియా వార్తాసంస్థలు ఫేస్‌బుక్‌లో వార్తలు షేర్ చేయడానికి, అక్కడి వినియోగదారులు తమ మాధ్యమంలో వార్తలను చూడటానికి వీలు లేకుండా బ్లాక్ చేసింది. ఈ చర్య తీవ్ర విమర్శలకు దారితీసింది. అయినా ప్రభుత్వం పట్టు వీడలేదు. డిజిటల్ ప్రకటనల ఆదాయంలో వార్తాసంస్థలకు సముచిత వాటా చెల్లించాల్సిందేనంటూ న్యూస్ మీడియా అండ్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ బార్‌గెయిన్ కోడ్ పేరుతో చట్టం చేసింది. కడకు ఫేస్‌బుక్ దిగిరాకతప్పలేదు. తాజాగా ఆ దేశంలోని ప్రైవేట్ మీడియా, స్క్వార్ట్జ్ మీడియా, సొల్సిటైస్ మీడియా అనే మూడు స్వతంత్ర వార్తాసంస్థలతో ఫేస్‌బుక్ ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది.
ఇతర దేశాలదీ అదేబాట
ఫ్రాన్స్, ఐరోపా యూనియన్‌లోని దేశాల్లో వార్తలు ప్రచురించినందుకు అక్కడి ప్రచురణకర్తలకు రుసుము చెల్లించేందుకు గూగుల్ అంగీకరించింది. అమెరికా, కెనడా కూడా ఈ దిశగా చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలోనూ వార్తా సంస్థల కంటెంట్‌ను వినియోగించుకునే గూగుల్, ఫేస్‌బుక్ లాంటి సంస్థలు వాటికొచ్చే ప్రకటనల ఆదాయంలో సంబంధిత వార్తా సంస్థలకు తగిన వాటా చెల్లించాలన్న డిమాండ్ బలంగా తెరపైకి వచ్చింది. ఈ విషయమై భారత వార్తాపత్రికల సంఘం(ఐఎన్‌ఎస్) గూగుల్‌కు ఇటీవల లేఖ రాసింది. పత్రికల్లోని వార్తాంశాలను వినియోగించుకున్నందుకు గూగుల్ తనకొచ్చే ప్రకటనల ఆదాయంలో వార్తాసంస్థలకు ఇస్తున్న మొత్తాన్ని 85 శాతానికి పెంచాలని ఆ లేఖలో డిమాండ్ చేసింది. అంతేకాదు- ఈ విషయంలో పారదర్శకత పాటించాలనీ కోరింది. ‘ప్రకటనల వ్యవస్థలో పారదర్శకత లోపించడంతో పత్రికా సంస్థలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. దీంతో గూగుల్‌లో వచ్చే ప్రకటనల వివరాలను పూర్తిగా పొందలేకపోతున్నాం. మేం ఆ ఆదాయం నుంచి సరైన వాటా పొందలేకపోవడానికి ఇదే ప్రధాన కారణం’ అని ఐఎన్‌ఎస్ అధ్యక్షుడు ఎల్.ఆదిమూలం పేర్కొనడం గమనార్హం.