తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఇంకా తరగని ఆకర్షణ- బిహార్‌లో లాలూ ప్రత్యేక ముద్ర

గత బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీని గెలిపించలేకపోయినా, తేజస్వి ఒంటి చేత్తో 75 స్థానాలు సాధించగలిగారు. దీన్నిబట్టి ముస్లిం-యాదవ పార్టీగా ఆర్జేడీకి ఉన్న ముద్రను ఆయన క్రమంగా చెరిపివేయ గలుగుతున్నారని అనుకోవడానికి ఆస్కారమేర్పడింది. అయితే.. ఉపఎన్నికల ప్రచారంలో లాలూ రాకతో అభిప్రాయాలు తారుమారయ్యాయి. అదే జేడీయూ గెలుపునకు దోహదం చేసింది.

lalu prasad yadav
లాలూ ప్రసాద్ యాదవ్

By

Published : Nov 16, 2021, 6:36 AM IST

ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయకుండా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దిల్లీ ఫామ్‌ హౌస్‌ను వదలి ఈ ఏడాది అక్టోబర్‌లో బిహార్‌లోని కుశేశ్వర్‌స్థాన్‌, తారాపూర్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) తరఫున ప్రచారం నిర్వహించారు. ఆయన అనూహ్య ఆగమనం ఆర్జేడీ కార్యకర్తలను హుషారెత్తించగా, ప్రత్యర్థులైన భారతీయ జనతా పార్టీ-జనతా దళ్‌(యు) శిబిరాన్ని పరమానందభరితుల్ని చేసింది. 2020 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరవాత లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌ ఎంతో కష్టపడి ఆర్జేడీ పటిష్ఠానికి చేసిన కృషి కాస్తా లాలూ రాకతో వృథా ప్రయాసగా మారిందన్న విశ్లేషణలు వినిపించాయి.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో లాలూ రాంచీ జైల్లో ఉన్నారు. అప్పుడు ఆర్జేడీ సంప్రదాయ మద్దతుదారులైన యాదవులు, ముస్లిములపైనే పూర్తిగా ఆధారపడకుండా అగ్రవర్ణాలు, ఇతర బీసీలనూ కలుపుకొని వెళ్ళడానికి తేజస్వి గట్టిగా కృషి చేశారు. బిహార్‌ జనాభాలో 18శాతం ఉన్న అగ్ర కులాలు, 35శాతం ఉన్న ఇతర ఓబీసీలు, 16శాతం ఉన్న దళిత ప్రతినిధులను ఎన్నికల ప్రచార సభల్లో వేదికపై తనతోపాటు కూర్చోపెట్టుకున్నారు. లాలూలా అగ్ర వర్ణాలపై విరుచుకుపడకుండా నిరుద్యోగం, ధరల పెరుగుదల, కొవిడ్‌ కాలంలో అస్తవ్యస్త ఆరోగ్య యంత్రాంగం గురించి ప్రస్తావించారు. ప్రచారంలో తన తండ్రి లాలూ, తల్లి రాబ్డీ దేవిల చిత్రాలను ఎక్కడా ఉపయోగించలేదు. ఆర్జేడీని ఎన్నుకుంటే 1990-2005నాటి లాలూ-రాబ్డి ఆటవిక పాలన తిరిగివస్తుందని భాజపా-జేడీయూలు చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టడానికి తేజస్వి ఈ విధంగా ప్రయత్నించారు.

ఒంటిచేత్తో 75 స్థానాలు..

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీని గెలిపించలేకపోయినా, తేజస్వి ఒంటి చేత్తో 75 స్థానాలు సాధించగలిగారు. దీన్నిబట్టి ముస్లిం-యాదవ పార్టీగా ఆర్జేడీకి ఉన్న ముద్రను ఆయన క్రమంగా చెరిపివేయ గలుగుతున్నారని అనుకోవడానికి ఆస్కారమేర్పడింది. అంతలో ఉపఎన్నికల ప్రచారానికి లాలూ వచ్చి దిగువ వర్గాలను ఆకట్టుకునే భాషలో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ నాయకుడు భక్త్‌ చరణ్‌ దాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన తీరు చూసి గూండాగిరీ తిరిగి వస్తుందని ముస్లిం-యాదవేతర వర్గాలు కలవరపడ్డాయి. అదే జేడీయూ గెలుపునకు దోహదం చేసింది. లాలూ నోరు పారేసుకోకుండా ఉంటే, భాజపా-జేడీయూ ప్రత్యర్థులంతా ఏకమై పాలక కూటమిని ఓడించగలిగేవారే!

ఉపఎన్నికల్లో ఆర్జేడీని గెలిపించకపోయినా 72 ఏళ్ల లాలూ సభలకు భారీయెత్తున జనం హాజరై, ఆయన వాగ్ధాటికి మురిసిపోయారు. యాదవ, ముస్లిం ఓటర్లలో ఆయనకున్న ఆదరణ చెక్కుచెదరలేదు. తన ప్రసంగాల్లో గ్రామీణుల నుడికారాలను, పదబంధాలను గుప్పించి శ్రోతలను ముగ్ధుల్ని చేయడం లాలూకు వెన్నతో పెట్టిన విద్య. ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడివారిని పేరుపేరునా పలకరిస్తారు. పల్లెవాసులతో కలిసి భోజనం చేస్తారు. గేదెలు, ఆవుల పాలు పితుకుతారు. విద్యావంతుల్లో అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని వ్యతిరేకించేవారంతా లాలూ అభిమానులే.

భాజపాను వ్యతిరేకిస్తూ..

1990లో బిహార్‌ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి లాలూ భాజపా సామాజిక అజెండాను, హిందుత్వను వ్యతిరేకిస్తూ వచ్చారు. దాన్ని అగ్రవర్ణేతర విద్యావంతులు హర్షించారు. జేడీయూ నేత నీతీశ్‌ కుమార్‌ మాదిరిగా లాలూ ఎన్నడూ ఆరెస్సెస్‌-భాజపాలతో రాజీపడలేదు. జేడీయూలో కుర్మీ కులస్థుల ఆధిక్యాన్ని నిరసించే వర్గాలూ లాలూకు దగ్గరయ్యాయి. ఆర్జేడీపై ఆయన పట్టు అంతాఇంతా కాదు. పలు రాష్ట్రాల్లో ఇతర పార్టీలను చీల్చగలిగిన భాజపా- బిహార్‌లో మాత్రం ఆర్జేడీలో చీలిక తీసుకురాలేకపోయింది.

సామాజిక న్యాయం తనద్వారానే సాధ్యమవుతుందన్న నమ్మకాన్ని దిగువ కులాల వారికి లాలూ కల్పించగలిగారు. 1990లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దిగువ కులాల ఆత్మగౌరవం కాపాడటమే తన కర్తవ్యమని ఆయన చాటసాగారు. సామాజిక సమానత్వం కోసం నిమ్న కులాలు జరిపిన పోరాటాలకు లాలూ-రాబ్డి ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇచ్చేది. కల్లుపై పన్ను రద్దు చేసింది. బిహార్‌ పట్టణాల్లో మురికివాడ వాసులకు ఇళ్లపట్టాలిచ్చింది. బిహార్‌ విశ్వవిద్యాలయానికి బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంగా పునఃనామకరణం చేసింది. 16వ శతాబ్దికి చెందిన దళిత సాధువు రవి దాస్‌ జన్మదినాన్ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది.

లాలూ హయాములో దిగువ కులాల వ్యవసాయ కూలీలు మెరుగైన వేతనాలు, ఆత్మగౌరవం కోసం అగ్రవర్ణ భూస్వాములపై పోరాడారు. అగ్రవర్ణాలు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోగలిగారు. దాంతో నక్సలైట్లకూ లాలూ అభిమానపాత్రుడయ్యారు. అయితే ఆయన హయాములో బిహార్‌ రాష్ట్రం కులాల సంగ్రామ క్షేత్రంగా మారిపోయింది. ప్రస్తుతం అక్కడ ఆర్జేడీకి 35శాతం ఓటు బ్యాంకు ఉంటే- జేడీయూకు 22శాతం, బీజేపీకి 16శాతం స్థిర ఓటు బ్యాంకులు ఉన్నాయి. దీన్నిబట్టి బిహార్‌ రాజకీయాల్లో ఆర్జేడీ ప్రభావం తగ్గలేదనే చెప్పాలి!

-- రాజీవ్‌ రాజన్‌

ఇదీ చదవండి:

తెల్లదొరలపై గిరిజన సమరభేరి- స్ఫూర్తినింపిన పోరాటాలు

ABOUT THE AUTHOR

...view details