అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు, జీవాయుధాలు.. ఇంతకాలంగా భూగోళాన్ని వణికిస్తూ వచ్చిన అస్త్రాలివి. యావత్ ప్రపంచాన్నే గడగడలాడించి, ఆధునిక దేశాలనూ కిందుమీదులు చేసిన కరోనా వైరస్(Coronavirus India) సైతం ఇదే తరహా ప్రాణాంతక ఆయుధాల్లో ఒకటి కావచ్చనే అనుమానాలు ఓ పక్క పీడిస్తున్నాయి. ఇంకోపక్క మరో కొత్త విపత్తు పొంచి ఉందా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో 'హవానా సిండ్రోమ్' (Havana Syndrome) పేరిట వెలుగులోకి వచ్చిన కొత్త తరహా రుగ్మత అందరిలో ఆందోళన పెంచుతోంది. ఇప్పటిదాకా అమెరికా దౌత్యవేత్తలే దీనికి లక్ష్యంగా మారారు. ఇటీవల అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(Kamala Harris News) వియత్నాం పర్యటన ఈ సమస్య కారణంగా కొన్ని గంటలపాటు ఆలస్యం కావడంతో ఇది మరోసారి వెలుగులోకి వచ్చింది. వియత్నాంలోని హనోయ్ దౌత్య కార్యాలయంలో రుగ్మత (Havana Syndrome) బారిన పడిన ఓ వ్యక్తిని అత్యవసర చికిత్స నిమిత్తం తరలించాల్సి వచ్చింది. వియత్నాంలోని అమెరికా దౌత్య సిబ్బంది ఇళ్లవద్ద కూడా ఇలాంటి అంతుచిక్కని దాడికి లోనైనట్లు తెలుస్తోంది. ఇది ఎందుకు వస్తోందో, ఎక్కడినుంచి వస్తోందో అగ్రరాజ్య శాస్త్రవేత్తలకూ అంతుచిక్కడం లేదు.
దౌత్య సిబ్బందే లక్ష్యం..
ప్రధానంగా అమెరికా దౌత్యవేత్తలనే పీడిస్తున్న ఈ సమస్యను తొలిసారిగా 2016లో క్యూబా రాజధాని హవానా నగరంలో అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బందిలో గుర్తించారు. మొదటిసారిగా హవానాలో బయటపడటంతో ఆ పేరుతోనే పిలుస్తున్నారు. అంతుచిక్కని ఈ సమస్య బారిన పడిన వారిలో(Havana Syndrome Symptoms) మెదడుపై ఏదో తెలియని తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. చుట్టూ కందిరీగల దండు తిరుగుతున్నట్లుగా రొద భరించలేనంత ఇబ్బందికి గురిచేస్తుంది. వికారం, తలపోటు, నిస్సత్తువ, కళ్లు తిరగడం, నిద్రలేమి, వినికిడిలోపం, మతిమరుపు వంటి లక్షణాలు వేధిస్తాయి. క్యూబాలో ఈ ప్రభావానికి (Havana Syndrome) లోనైనవారిలో మూడోవంతు మందికి వినికిడి శక్తి దెబ్బతింది. వారి మెదళ్లు సైతం దెబ్బతిన్నట్లు స్కానింగ్‌లలో బయటపడింది. ప్రమాదాల్లో గాయపడే స్థాయిలో మెదడుకు నష్టం వాటిల్లినట్లు తేలింది. క్యూబా, చైనాల్లోని దౌత్య కార్యాలయాల్లో పనిచేసే వారిలోనే బాధితులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
దౌత్యవేత్తలు, గూఢచారులు, సైన్యం, సీఐఏ సిబ్బంది, విదేశాంగ శాఖ అధికారులే బాధితులుగా మారుతుండటంతో కుట్రకోణాల్ని అనుమానిస్తున్నారు. గత అయిదేళ్ల వ్యవధిలో పెద్దసంఖ్యలోనే జనం ఈ సమస్యతో సతమతమైనట్లు అంచనా. జర్మనీ, ఆస్ట్రేలియా, తైవాన్, ఆస్ట్రియా, రష్యాలోని అమెరికా దౌత్య సిబ్బంది కూడా ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. అమెరికా అధికారుల కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు వంటి ఉపకరణాల నుంచి నిఘా సమాచారాన్ని సేకరించే క్రమంలో ఇలాంటి దాడులు జరుగుతూ ఉండవచ్చనే అనుమానాలూ లేకపోలేదు.
మైక్రోవేవ్ తరంగాలతో..?