అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగుతోంది. ఇప్పటికే ట్రంప్ అధ్యక్షతన అమెరికా- మోదీ సారథ్యంలోని భారత్ మధ్య సత్సంబంధాలు ఎన్నడూ లేనంతగా పుంజుకున్నాయి. ట్రంప్ మరోసారి అధ్యక్షుడైతే ఆ బంధానికి సమస్య లేదు. కానీ బైడెన్ అధ్యక్షుడైతే పరిస్థితి ఏంటి? ఇరుదేశాల మధ్య ఇదే సాన్నిహిత్యం కొనసాగుతుందా? ముగిసిపోతుందా? అనేది సందిగ్ధంగా మారింది.
బైడెన్‌దే గెలుపు!
పలు సర్వేల ప్రకారం చూస్తే.. ఈసారి అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనాన్సియల్ టైమ్స్ పోల్ ట్రాకర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం జో బైడెన్ 538 సీట్లలో 308 సీట్లు కైవసం చేసుకోవచ్చు. ట్రంప్‌కు కేవలం 113 సీట్లు వస్తాయి. 538 సీట్లలో 270 సీట్లు సంపాదిస్తే ఆ వ్యక్తి అధ్యక్షుడు అయినట్లే.
అమెరికన్ యూనివర్సిటీలోని ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్ అయిన్ అలన్ లిచ్మెన్ కూడా బైడెన్ గెలుస్తారనే జోస్యం చెప్పారు. తను రూపొందించిన కీస్ మోడల్ ఆధారంగా 13 చారిత్రక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఫలితాలు అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. గత నాలుగు దశాబ్దాలుగా లిచ్మెన్ అధ్యక్ష ఎన్నికల గురించి దాదాపు కచ్చితమైన వివరాలు చెప్తున్నారు.
కరోనా నియంత్రణలో విఫలమవడం వల్లే ట్రంప్‌పై వ్యతిరేకత ఎక్కువైనట్లు పలు నివేదికలు తెలిపాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోస్టల్ ఓటింగ్ పెడితే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని.. ఫలితంగా ఎన్నికలను వాయిదా వేయాలని ట్రంప్ అభిప్రాయపడటం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
అదే బాటలో...!
ప్రస్తుతం వాషింగ్టన్, బీజింగ్ మధ్య వాణిణ్య యుద్ధం జరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో కొత్త అధ్యక్షుడు వచ్చాక.. భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు ఎలా మారుతాయనేది ఆసక్తికరంగా మారింది. అయితే అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు బైడెన్ ఆధ్వర్యంలోని కొత్త వైట్‌హౌస్ ఈ అంశంలో ట్రంప్ అడుగుజాడల్లోనే నడుస్తుందని, భారత్‌తో సత్సంబంధాల విషయంలో వెనక్కితగ్గదని పరిశీలకులు భావిస్తున్నారు.
చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ బాధ్యతలు చేపట్టాక ప్రపంచ నంబర్ వన్‌గా ఎదగాలన్న ఆ దేశ ఆశయాన్ని అమెరికా అడ్డుకుంది. ఫలితంగా ఆ దేశానికి దీటైన భారత్‌తో రెండు దశాబ్దాలుగా మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలను నెరుపుతోంది అగ్రరాజ్యం. బైడెన్ ఎన్నికైతే దక్షిణ చైనా సముద్రంలో వివాదం కారణంగా చైనాతో వాణిజ్య యుద్ధం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని నిలువరించడంలో ట్రంప్ పాటిస్తున్న విధానాలనే అమలు చేస్తారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అతిపెద్ద రక్షణ భాగస్వామి...
భారత్, అమెరికా కలిసి అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాల్లో పరస్పర ప్రయోజనాల దృష్ట్యా ఈ బంధం ఏర్పడింది. అందుకే వాషింగ్టన్ కూడా భారత్‌ను అతిపెద్ద రక్షణ భాగస్వామిగా ఎంచుకుంది. రక్షణ, దౌత్య సంబంధాల్లోనూ దిల్లీతో చాలా సాన్నిహిత్యంగా ఉంది అమెరికా.
"బైడెన్ అధికారంలోకి వస్తే భారత్-అమెరికా మధ్య సంబంధాలు అలాగే కొనసాగుతాయి. ప్రజల్లోనూ ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు అంత బలంగా ఉన్నాయి. అయితే అవి మరింత పుంజుకోవచ్చు. అయితే బైడెన్ వచ్చాక ఆ సంబంధాలు ఎంత వేగంగా, ఎంత పురోగతితో పయనిస్తాయి అనేది కీలకం. ఎన్నికలు అనేవి యూఎస్ కాంగ్రెస్‌లోని ఎగువ, దిగువ సభకు ఉంటాయి. ప్రస్తుతం దిగువ సభలో డెమొక్రాట్లు ఆధిపత్యం చెలాయిస్తే, సెనేట్‌లో రిపబ్లికన్ ఆధిపత్యం ఉంది. ఒకవేళ సెనేట్‌లోనూ డెమొక్రాట్లు మెజారిటీ సాధించి.. బైడెన్ అధికారంలో ఉంటే భారత్-అమెరికా బంధం గతంలోలా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది డెమొక్రాట్లకు భారత్‌తో సమస్యలున్నాయి".
- రాబిన్ సచ్దేవ్, యూఎస్-ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ ఫౌండర్ మెంబర్