ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం బర్లగూడెం గ్రామానికి చెందిన బానోత్ హరి (65), బానోతు సంతు అన్నదమ్ములు. వీరి మధ్య ఇంటి స్థలం విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. హరికి ఇద్దరు కొడుకులు ఉండగా ఒకరు విద్యుదాఘాతంతో మృతి చెందారు. మరొకరు అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో ఇద్దరు కోడళ్లు, వారి నలుగురు పిల్లల సంరక్షణ బాధ్యత హరి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హరి-సంతుల నడుమ ఉమ్మడి ఆస్తి ఇంటి స్థలం నాలుగు కుంటల విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. పలుమార్లు పెద్ద మనుషులు వద్ద పంచాయతీ కూడా జరిగింది.
ఆదివారం హరి తన కోడలు అనిత వ్యవసాయ భూమిని దున్నించేందుకు పంట చేను వద్దకు ట్రాక్టర్‌ను తీసుకొని వెళ్లారు. ఇంటిస్థల వివాదం పరిష్కారం కాకుండా చేను దున్నొద్దంటూ వారి ట్రాక్టర్‌ను సంతు అడ్డుకున్నాడు. ఆందోళనకు గురైన హరి అక్కడే సృహ తప్పి పంటచేనులోనే పడిపోయాడు. వెంటనే కోడలు స్థానిక వైద్యుడు వద్దకు తరలించగా అప్పటికే మృతి చెందాడని తెలిపారు.