ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ దేశంలోని టెల్ అవిన్ నగరంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాలు దర్శనమిచ్చాయి. ఆ దేశ ప్రధానమంత్రి బెంజిమెన్ నెతెన్యాహూకు చెందిన లికుడ్ పార్టీ తన ప్రచారంలో మోదీతో పాటు అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్ల చిత్రాలను ఉపయోగిస్తోంది. ఈ ముగ్గురి నేతలతో నెతెన్యాహూ దిగిన ఫోటోలతో భారీ బ్యానర్లను టెల్ అవిన్ నగరంలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంపై ప్రదర్శించింది.
ప్రపంచదేశాలకు చెందిన అగ్రనేతలతో నెతెన్యాహూకున్న సాన్నిహిత్యాన్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకుంటోంది లికుడ్ పార్టీ. ఈ సాన్నిహిత్యం దేశ భద్రతకు ఎంతో ముఖ్యమని తెలియజేయడానికే ఈ విధంగా ప్రచారం చేస్తోంది. ఇజ్రాయెల్ రాజకీయాల్లో ఆయనది తిరుగులేని స్థాయి అన్న భావనను ఓటర్లలో కలిగించేందుకు ప్రయత్నిస్తోంది.
సెప్టెంబర్ 9న భారత పర్యటనకు...
ఇజ్రాయెల్లో సెప్టెంబర్ 17న ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 9న మోదీతో భేటీకి నెతెన్యాహూ భారత్ రానున్నారు. ఈ పర్యటన ఆయన ప్రచారానికి ఉపకరిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.