తెలంగాణ

telangana

ETV Bharat / international

బెంగళూరులో కొత్త కాన్సులేట్​.. అమెరికాలోనే H1-B వీసా రెన్యువల్​!: మోదీ

PM Modi US Visit : భారత్‌-అమెరికా భాగస్వామ్యం 21వ శతాబ్దంలో ప్రపంచ భవిష్యత్తును మార్చగలదని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. భారత్​ ప్రజాస్వామ్యానికి తల్లి అని.. అమెరికా ప్రజాస్వామ్యానికి ఛాంపియన్ అన్నారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇక నుంచి H1-B వీసా పునరుద్ధరణ అమెరికాలోనే చేసుకోవచ్చని ప్రధాని మోదీ అన్నారు. మరోవైపు.. భారత్‌-అమెరికా సంబంధాల బలోపేతానికి ప్రధాని మోదీ నిబద్ధతతో పనిచేస్తున్నారని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తెలిపారు.

pm modi us visit
pm modi us visit

By

Published : Jun 24, 2023, 7:18 AM IST

Updated : Jun 24, 2023, 8:38 AM IST

PM Modi US Visit : భారత్​.. ప్రజాస్వామ్యానికి తల్లి.. అమెరికా ఆధునిక ప్రజాస్వామ్యానికి ఛాంపియన్ అని ప్రధాని మోదీ తెలిపారు. రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల బంధం బలపడడాన్ని ప్రపంచం గమనిస్తోందని ప్రధాని అన్నారు. 21వ శతాబ్దంలో భారత్​-అమెరికా భాగస్వామ్యం ప్రపంచ భవిష్యత్తును మరింత మార్చగలదని అభిప్రాయపడ్డారు.అమెరికా పర్యటనలో భాగంగా మోదీ.. ప్రవాస భారతీయులను ఉద్దేశించి శుక్రవారం(అమెరికా కాలమానం ప్రకారం) ప్రసంగించారు. ప్రవాస భారతీయులకు గుడ్​న్యూస్ చెప్పారు ప్రధాని మోదీ. ఇక నుంచి H1-B వీసా పునరుద్ధరణ అమెరికాలోనే చేసుకోవచ్చని ప్రధాని మోదీ అన్నారు.

'అమెరికా కొత్త కాన్సులేట్‌లు బెంగళూరు, అహ్మదాబాద్‌లలో త్వరలో తెరుస్తారు. H1-B వీసా పునరుద్ధరణ అమెరికాలోనే చేసుకోవచ్చు. భారత్​లో యుద్ధ విమానాలను తయారు చేసేందుకు జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ తీసుకున్న నిర్ణయం భారత రక్షణ రంగంలో మైలురాయిగా నిలుస్తుంది. భారత్​-యూఎస్​ మధ్య కుదిరిన ఆర్టెమిస్ ఒప్పందం అంతరిక్ష పరిశోధనలో అనేక అవకాశాలను అందిస్తుంది. నాసాతో కలిసి భారత్​ అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపుతుంది. యూఎస్‌లో నేను పొందుతున్న ప్రేమ అద్భుతం. క్రెడిట్ అంతా అమెరికా ప్రజలకే చెందుతుంది.
వాషింగ్టన్​లోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్​లో సభకు హాజరైన ప్రజలను చూసి.. ఈ హాలులో భారతదేశం పూర్తి మ్యాప్​ను చూసినట్లు ఉందని అన్నారు. అమెరికా నలుమూలల నుంచి ఈ సభకు హాజరయ్యారని ప్రశంసించారు.

మోదీకి కమలా హారిస్ విందు..
Narendra Modi America Tour : అమెరికా పర్యటనలోఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి.. ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె భారత్​పై ప్రశంసలు కురిపించారు. భారత్‌-అమెరికా సంబంధాల బలోపేతానికి ప్రధాని మోదీ నిబద్ధతతో పనిచేస్తున్నారని కమలా హారిస్‌ తెలిపారు. మోదీ, బైడెన్‌ హయాంలో ఇరుదేశాల సంబంధాలు ఉన్నత స్థాయికి చేరాయని ఆమె తెలిపారు. భారతదేశ చరిత్ర, బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తెలిపారు. భారత్​తో తనకు ఎంతో అనుబంధం ఉందని ఆమె అన్నారు. 21వ శతాబ్దంలో భారత్​.. ప్రపంచ శక్తిగా ఎదగడంలో కీలక పాత్ర పోషించినందుకు ప్రధాని మోదీకి కమలా హారిస్ ధన్యవాదాలు తెలిపారు.

తన పర్యటన వల్లభారత్- అమెరికా మధ్య స్నేహం, సహకారం మరింత బలోపేతం అవుతుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పలు రంగాల్లో అమెరికా, భారత్‌ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. కమలా హారిస్ సాధించిన ఘనత అమెరికాకే కాదు.. మహిళలందరికీ స్ఫూర్తి అని చెప్పారు. అలాగే కమలా హారిస్​పై ప్రశంసలు కురిపించారు.

సీఈఓలతో మోదీ భేటీ..
భారత్‌ నైపుణ్యాలు, అమెరికా అధునాతన సాంకేతికత కలిస్తే ప్రపంచానికి మరింత మెరుగైన భవిష్యత్‌ను అందించవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌లోని శ్వేతసౌధంలో రెండు దేశాలకు చెందిన దిగ్గజ సంస్థల సీఈఓలతో ప్రధాని మోదీ ముచ్చటించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల, యాపిల్ CEO టిమ్ కుక్, గూగుల్‌ CEO సుందర్‌ పిచాయ్, ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్‌మన్, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ వంటి అమెరికా ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

భారత్‌ నుంచి.. రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ, మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్ మహీంద్రా వంటి ప్రముఖులు పాల్గొన్నారు. భారత్‌-అమెరికా భాగస్వామ్యం భవిష్యత్ తరాలకు.. మరింత స్వేచ్ఛాయుత, భద్రమైన, సాధికారతకు భరోసా ఇస్తుందని.. బైడెన్ చెప్పారు. బైడెన్ విజన్, సామర్థ్యాలు, భారత ఆకాంక్షలు.. గొప్ప అవకాశాలు సృష్టిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. హైటెక్‌ రంగంలో భారత్‌, ఆమెరికా బంధం మరింత బలోపేతమవుతున్న నేపథ్యంలో.. అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాని సూచించారు.

భారత్​లో పెట్టుబడులు..
ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్​తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గుజరాత్​లో గ్లోబల్ ఫిన్​టెక్ ఆపరేషన్ సెంటర్​ను ఏర్పాటు చేయనున్నట్లు సుందర్ పిచాయ్​ తెలిపారు. ఈ మేరకు 10 బిలియన్​ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు.. భారత్​లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తెలిపారు.

యువ పారిశ్రామికవేత్తలతో..
భారత్‌-అమెరికా భాగస్వామ్యం 21వ శతాబ్దంలో ప్రపంచ భవిష్యత్తును మార్చగలదని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. భారత్ -అమెరికా భాగస్వామ్యం సౌలభ్యం కోసం కాదని, నమ్మకం, భాగస్వామ్య కట్టుబాట్లు, కరుణతో కూడినదన్నారు. జాన్‌ఎఫ్‌. కెన్నెడి సెంటర్‌లో జరిగిన యువ పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణుల సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. భారత్‌ బలపడినప్పుడల్లా ప్రపంచానికి మేలు జరిగినట్లు చెప్పారు.

కరోనా విజృంభణ సమయంలో.. ఈ విషయం వెల్లడైనట్లు గుర్తు చేశారు. ప్రపంచానికి ఔషధాలు అవసరమైనప్పుడు.. భారత్‌ ఉత్పత్తిని పెంచి మందులు సరఫరా చేసినట్లు భారత్‌- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ప్రధాని తెలిపారు. భారత్‌ విజయాలకు, అభివృద్ధికి ప్రజల ఆకాంక్షలే అతిపెద్ద చోదకశక్తి అని కొనియాడారు. గత రెండున్నరేళ్లలో అమెరికా కంపెనీలు.. భారత్‌లో 16 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు ప్రధాని వెల్లడించారు.

"ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ గురించి మీకు తెలిసే ఉంటుంది. అధిక వృద్ధి రేటు, తక్కువ ద్రవ్యోల్బణం సాధించడం అంత సులభం ఏమీ కాదు. కానీ భారత్‌ దానిని కూడా చేసి చూపుతోంది. ద్రవ్యలోటును నియంత్రణలో ఉంచుతూనే మూల ధన పెట్టుబడులను క్రమంగా పెంచుతున్నాం. మా ఎగుమతులు పెరుగుతున్నాయి. విదేశీ మారక నిల్వలు పెరుగుతూనే ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. గత రెండున్నరేళ్లలో అమెరికా కంపెనీలు 16 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టాయి.

--నరేంద్ర మోదీ, భారత ప్రధాని

ఈజిప్టునకు పయనం..
PM Modi Egypt Visit : ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగించుకుని ఈజిప్టునకు బయలుదేరారు. ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌-సీసీ ఆహ్వానం మేరకు రెండు రోజులపాటు మోదీ అక్కడ పర్యటించనున్నారు. 1997 తర్వాత భారత ప్రధాని ఒకరు ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి. మొదటి ప్రపంచ యుద్ద సమయంలో ఈజిప్టు, పాలస్తీనాల్లో ఉండి పోరాడి మరణించిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించిన తర్వాత ఆయన పర్యటన ప్రారంభమవుతుంది.

సుమారు 4వేల మంది సైనికులు అప్పట్లో పోరాటంలో పాల్గొని చనిపోయారు. వారి కోసం హెలియోపొలిస్‌ కామన్‌వెల్త్‌ వార్‌ గ్రేవ్‌ సిమెట్రీలో స్మారకం నిర్మించారు. వాస్తవానికి తొలుత నిర్మించిన స్మారకాన్ని 1970లో జరిగిన ఇజ్రాయెల్‌-ఈజిప్టు యుద్ధ సమయంలో ధ్వంసం చేశారు. ఆ తర్వాత మళ్లీ నిర్మించారు. దీంతోపాటు అతి పురాతన అల్‌ హకీమ్‌ మసీదునూ మోదీ సందర్శిస్తారు.

Last Updated : Jun 24, 2023, 8:38 AM IST

ABOUT THE AUTHOR

...view details