తెలంగాణ

telangana

ETV Bharat / international

అణుబాంబు వేయడం ఉత్తమం: ఇమ్రాన్​ ఖాన్​ - ఇమ్రాన్​ఖాన్​ న్యూస్​

Imran Khan: దేశాన్ని దొంగలకు అప్పజెప్పడం కంటే అణుబాంబు వేయడం ఉత్తమం అన్నారు పాకిస్థాన్​ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్​. ప్రధానమంత్రి షెహ్‌బాజ్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతరులపై అవినీతి ఆరోపణలు చేయడం మానేసి, ప్రభుత్వ పనితీరును చక్కదిద్దాలని ఇమ్రాన్‌ హితవు పలికారు.

imran khan shahbaz sharif
imran khan shahbaz sharif

By

Published : May 15, 2022, 5:07 AM IST

Imran Khan: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నూతన ప్రభుత్వంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రధానమంత్రి షెహ్‌బాజ్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. దేశాన్ని దొంగలకు అప్పజెప్పడం కంటే అణుబాంబు వేయడం ఉత్తమం అని పేర్కొన్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ తన నివాసంలో విలేకర్లతో మాట్లాడుతూ.. దేశాన్ని దొంగలు హస్తగతం చేసుకోవడం చూసి తాను షాక్‌కు గురైనట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వీరు ప్రతి సంస్థను, న్యాయవ్యవస్థను నాశనం చేశారని పేర్కొంటూ.. ఇప్పుడు ఏ ప్రభుత్వ అధికారి ఈ నేరస్థుల కేసులను విచారిస్తారని ప్రశ్నించారు. ఇతరులపై అవినీతి ఆరోపణలు చేయడం మానేసి, ప్రభుత్వ పనితీరును చక్కదిద్దాలని ఇమ్రాన్‌ హితవు పలికారు.

ప్రస్తుత పరిపాలనను మరోసారి'దిగుమతి ప్రభుత్వం' అని పేర్కొన్న పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ఛైర్మన్.. ఈ సర్కారుకు వ్యతిరేకంగా ఈ నెల 20న ఇస్లామాబాద్‌లో లాంగ్‌ మార్చ్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నిజమైన స్వాతంత్ర్యం పొందేందుకు 20 లక్షల మందితో ఈ లాంగ్‌ మార్చ్‌ కొనసాగుతుందని, దీన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని తెలిపారు. తన మద్దతుదారులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని పేర్కొన్న ఇమ్రాన్‌ ఖాన్‌.. 11 పార్టీలు ఏకమై తనను ప్రధాని పదవి నుంచి తొలగించాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. పాకిస్థాన్‌ రూపాయి రోజురోజుకూ పతనమవుతూ, దేశ చరిత్రలోనే అత్యల్ప స్థాయికి చేరింది. ఆ దేశ కరెన్సీలో డాలరు విలువ రూ.193 పలికింది. ఈ పరిస్థితిపై ఇమ్రాన్‌ఖాన్‌ శుక్రవారం స్పందించారు. దేశ సంక్షోభ సమయంలో 'తటస్థులు'గా వ్యవహరించిన తమ ఆర్మీయే ఇందుకు కారణమని నిందించారు. పాక్‌పై విదేశీకుట్ర విజయవంతమై తన ప్రభుత్వం పతనమైతే, అప్పటికే బలహీనంగా ఉన్న దేశ ఆర్థికవ్యవస్థ మరింత దిగజారుతుందని ముందుగానే సైన్యాన్ని హెచ్చరించానని గుర్తు చేసుకొన్నారు. ఇపుడు పాక్‌ మార్కెట్‌ సంస్కరణలు కోరుకొంటున్నా.. దేశంలోని 'దిగుమతి ప్రభుత్వం' చేతులు కట్టుకు కూర్చొందని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:చైనాకు త్వరలో కొత్త అధ్యక్షుడు.. జిన్​పింగ్ రాజీనామా!

ABOUT THE AUTHOR

...view details