తెలంగాణ

telangana

By

Published : Feb 27, 2023, 6:35 PM IST

ETV Bharat / international

తుర్కియేలో మరోసారి భూకంపం.. ఒకరు మృతి.. 69 మందికి గాయాలు

తుర్కియేలో మరోసారి భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 69 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.

New quake hits turkey toppling more buildings
తుర్కియేలో మరోసారి భూకంపం

మూడు వారాల క్రితం భారీ భూకంపంతో వణికిపోయిన తుర్కియేలో వరుస ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. సోమవారం 5.6 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. మలత్యా రాష్ట్రంలోని యెసిల్యూర్ట్ పట్టణంలో భూమి కంపించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో 69 మంది గాయాలపాలైనట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ ఏఎఫ్​ఏడీ తెలిపింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల వచ్చిన భూకంపానికి అనేక ఇళ్లు కుప్పకూలగా.. మరికొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. సోమవారం సంభవించిన భూకంపంతో దెబ్బతిన్న ఇళ్లు పూర్తిగా నేలకొరిగాయని అధికారులు తెలిపారు. సుమారు 25 భవనాలు కూలినట్లు చెప్పారు. పట్టణంలోని ఓ నాలుగు అంతస్తుల భవనం శిథిలాల కింద తండ్రీకుమార్తెలు చిక్కుకోగా.. వారి ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్​లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తమ ఇంట్లోని వస్తువులను తెచ్చుకునేందుకు తండ్రీకుమార్తెలు భవనంలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. వారితో పాటు ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు శిథిలాల గాలింపు చర్యలు చేపట్టాయి. కొన్ని పార్క్​ చేసిన వాహనాలపై కూడా భవనాలు కుప్పకూలిపోయినట్లు అధికారులు తెలిపారు.

ఫిబ్రవరి 6న దక్షిణ తుర్కియే, ఉత్తర సిరియాలో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ విపత్తు కారణంగా తీవ్రంగా ప్రభావితమైన 11 రాష్ట్రాలలో మాలత్యా కూడా ఒకటి. ఈ ప్రకృతి విలయ తాండవం కారణంగా తుర్కియే, సిరియా దేశాలలో 48 వేల మందికి పైగా మృతి చెందారు. దీంతోపాటు ఈ ప్రమాదంలో ఇప్పటివరకు సుమారు 1,73,000 భవనాలు దెబ్బతిన్నాయి. ఫిబ్రవరి 6 నుంచి ఇప్పటివరకు భూకంప ప్రభావిత ప్రాంతాలలో దాదాపు 10,000 ప్రకంపనలు సంభవించాయి. దీంతో దెబ్బతిన్న భవనాల్లోకి వెళ్లొద్దని ఏఎఫ్ఏడీ చీఫ్ ప్రజలను కోరారు.

ఈ భూకంపం ఎన్నో వేల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ భూ ప్రకంపనల కారణంగా లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. వారికి ఇప్పటికి కూడా కనీస అవసరాలు సరిగా తీరడం లేదు. ఇప్పటికీ వేలల్లో బాధితులు హాస్పిటల్స్​లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రకృతి విలయంలో చాలా ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమై ఎక్కడ చూసినా శిథిలాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. అయితే తుర్కియేను అతలాకుతలం చేసిన ఈ భూకంపం గత 100 ఏళ్ల కాలంలో కనీవినీ ఎరగనిదిగా నిపుణులు చెబుతున్నారు. 1939లో సంభవించిన ఎర్జింకాన్ భూకంపం కారణంగా 33 వేల మంది పౌరులు చనిపోగా.. మళ్లీ ఇప్పుడు అంతకంటే ప్రమాదకర స్థాయిలో భూకంపం ప్రభావం చూపిందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details