Japan Fish Dead In Beach :ఉత్తర జపాన్‌లోని సముద్రం తీరానికి వేలాదిగా మృతిచెందిన చేపలు కొట్టుకువచ్చాయి. ఒక కిలోమీటరు వరకు సముద్రం ఒడ్డున ఈ మృతిచెందిన చేపలే ఉన్నాయి.ఇలా వేలాదిగా చేపలు మృత్యువాతపడటానికి స్పష్టమైన కారణం తెలియరావడం లేదు. హక్కైడో ప్రిఫెక్చర్‌లోని హకోడేట్ తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పెద్ద చేపల వెంటాడటం వల్ల ఇలా చేపలు మరణించి ఉంటాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. లేదా శీతల జలాల్లోకి పెద్ద సంఖ్యలో చేపలు ప్రవేశించినా ఇలా వేల సంఖ్యలో మృత్యువాత పడుతుంటాయని తెలిపారు. చేపల మృతికి స్పష్టమైన కారణం తెలియకపోవడం వల్ల ఇలాంటి చేపలు తినడం ప్రమాదకరమని ప్రజలను హెచ్చరిస్తున్నారు. స్థానిక అధికారులు సముద్రం ఒడ్డుకు చేరుకుని మృతిచెందిన చేపలను సేకరిస్తున్నారు.
"ఇలాంటి పరిణామాల గురించి గతంలో విన్నాను. కానీ ప్రత్యక్షంగా చూడటం ఇదే తొలిసారి. భారీ చేప వీటిని తరిమి ఉండొచ్చు. దాన్నుంచి తప్పించుకునేందుకు చాలాసేపు ఈదడం వల్ల చేపలు అలసిపోయి ఉంటాయి. అన్నీ ఒకే చోటికి చేరుకోవడం వల్ల ఆక్సిజన్ కొరత తలెత్తి అవి చనిపోయి ఉండవచ్చు. కుళ్లిపోయిన చేపలు జలాల్లో ఆక్సిజన్‌ను మరింత తగ్గేలా చేస్తాయి. చేపలు ఎందువల్ల చనిపోయాయో స్పష్టంగా తెలియదు కాబట్టి వాటిని తినొద్దని కోరుతున్నా."
-టకాషి ఫుజియోకా, హకోడాటె ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుడు