Israel War Hamas Weapons :ఉత్తర గాజాలో హమాస్‌కు చెందిన అతిపెద్ద ఆయుధ నిల్వను గుర్తించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. RPG మిస్సైళ్లు, యాంటీ ట్యాంక్ క్షిపణులు, పేలుడు పదార్థాలు, రాకెట్లు, గ్రెనేడ్లు, డ్రోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఆయుధాలను ఓ పాఠశాల, ఆస్పత్రికి సమీపంలో గుర్తించినట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. ఇజ్రాయెల్‌పై ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచిన మిస్సైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పౌరులు నివాసాలకు సమీపంలోనే ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను సైతం గుర్తించినట్లు చెప్పారు. యుద్ధంలో పాలస్తీనియన్లను హమాస్ మిలిటెంట్ సంస్థ కవచాలుగా వాడుకుంటోందనడానికి ఇదొక ఆధారమని అన్నారు.
దక్షిణ గాజాలో హమాస్‌కు చెందిన సీనియర్ నాయకులు ఉండొచ్చనే అనుమానంతో ఇజ్రాయెల్‌కు చెందిన బలగాలు ఆ ప్రాంతంపై భీకరంగా దాడులు చేస్తున్నాయి. హమాస్ గ్రూప్ లీడర్ సిన్వర్, మిలిటరీ వింగ్ కమాండర్ మహ్మద్ దీఫ్‌లు అక్కడే తలదాచుకొని ఉంటారని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. దక్షిణ గాజాలోని అతిపెద్ద నగరం ఖాన్ యూనిస్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను రఫా వైపు వెళ్లాలని ఐడీఎఫ్ తాజాగా ఆదేశించింది. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరం వద్ద కూడా ఐడీఎఫ్ దళాలు క్యాంపును ఏర్పాటు చేసుకున్నాయి. ఈ శరణార్థి శిబిరం కేంద్రంగా హమాస్ తన కార్యకలాపాలను సాగిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ శిబిరంలో ఎంత మంది శరణార్థులు ఉన్నారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు.