Hamas Commander Killed : ఇజ్రాయెల్ దాడుల్లో ఉత్తర గాజా ఇన్‌ఛార్జి అహ్మద్ అల్ ఘాందౌర్ మృతి చెందినట్లు హమాస్ ప్రకటించింది. అయితే ఎప్పుడు, ఎక్కడ మరణించాడనేది మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. మరో ముగ్గురు మిలిటరీ నేతలూ చనిపోయినట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌తో సాగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు మృతిచెందిన హమాస్ సభ్యుల్లో అహ్మద్ కీలకమైన వ్యక్తి అని అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి. ఇతడు ఉత్తర గాజాకు బ్రిగేడ్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడని.. గతంలోనూ ఇజ్రాయెల్ జరిపిన దాడుల నుంచి మూడు సార్లు తప్పించుకున్నట్లు అంతర్జాతీయ కథనాలు తెలిపాయి. 2017లో అమెరికా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చి, ఆర్థిక ఆంక్షలూ విధించింది. అంతకుముందు నిరిమ్ మారణకాండకు బాధ్యుడైన బిలాల్ అల్ కేద్రా, హమాస్ ఏరియల్ ఫోర్స్ హెడ్ అబు మురద్.. నక్బా యూనిట్ కమాండర్లు అహ్మద్ మౌసా, అమర్ అల్హంది ఉగ్రవాదులను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది.
వెస్ట్‌బ్యాంక్‌లో 8 మంది పాలస్తీనీయన్ల మృతి
Israel Hamas Ceasefire : అటు ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉండగా.. వెస్ట్‌బ్యాంక్‌లో మాత్రం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ఎనిమిది మంది పాలస్తీయన్లను ఇజ్రాయెల్ దళాలు కాల్చి చంపాయని పాలస్తీనా ఆరోగ్యశాఖ తెలిపింది. జెనిన్ శరణార్థి శిబిరంలో ఐదుగురు మృతి చెందగా.. సెంట్రల్ వెస్ట్‌బ్యాంక్‌లో ఒకరు, ఇతర ప్రాంతాల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. దీనిపై ఇజ్రాయెల్ దళాలు సైతం ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇజ్రాయెల్‌కు చెందిన తండ్రీకొడుకులను కారుతో గుద్ది చంపిన కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా... అక్కడి వారు తమపై దాడి చేశారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దీంతో కాల్పులు జరిపినట్లు పేర్కొంది. ఈ ఘటనలో మరణించిన వారంతా ఉగ్రవాదులేనని ఇజ్రాయెల్ తెలిపింది.