Congo Boat Accident :ఇంధనంతో వెళుతున్న ఓ పడవ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. కాంగోలోని ఓ నదిలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో 11 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఇంకా చాలా మంది ఆచూకీ లభించలేదని వెల్లడించారు. సోమవారం ఈ ప్రమాదం జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన పడవ ఇందనాన్ని లోడ్ చేసుకుని.. ఎమ్బండకా నుంచి రాజధాని కిన్షాసా వరకు వెళ్తోందని అన్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే సహయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
కాంగోలో రోడ్డు రవాణా వ్యవస్థ అంతగా బాగుండదు. పడవ ప్రయాణంతో పోలిస్తే దాని ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో పడవ ప్రయాణానికే ఎక్కువగా మొగ్గు చూపుతారు కాంగో ప్రజలు. కాగా ఆదివారమే ఉత్తర కివు ప్రావిన్స్‌లోని రుత్షురు ప్రాంతంలో ఇళ్లు తగలబడి దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. M23 తిరుగుబాటుదారులే ఈ ఘటనకు కారణమని స్థానిక అధికారులు తెలిపారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు మృతి..
US Road Accident Today :అమెరికాలో పొగమంచు బీభత్సం సృష్టిస్తోంది. ఈ పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సోమవారం జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది గాయపడ్డారు. దీనిపై సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైనట్లు లూసియాన్ స్టేట్ పోలీసులు తెలిపారు. ఘటనలో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. అనంతరం వాహనాలను తొలగించే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. అయితే బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.