మృత్యువు ఎప్పుడు.. ఎవరిని.. ఎలా.. కబళిస్తుందో తెలియదు. అప్పటివరకూ మనతో నవ్వుతూ గడిపిన ఆప్తులు.. మరు నిమిషంలో జరిగే ప్రమాదంలో శాశ్వతంగా దూరం కావొచ్చు. ఇలాంటి ఘటనే బ్రెజిల్‌లో జరిగింది. విమాన ప్రమాదంలో.. బ్రెజిల్ పాప్ స్టార్ (brazil pop singer) మారిలియా మెండోన్సా(26) కన్నుమూశారు(Marilia Mendonca death). ప్రమాదానికి ముందు విమానంలో మెండోన్సా దృశ్యాలు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి.
ఎంతో ఉత్సాహంగా సంగీత కచ్చేరికి బయలుదేరిన బ్రెజిల్ పాప్‌స్టార్ (brazil pop singer) మారిలియా మెండోన్సాను.. విమాన ప్రమాదం బలితీసుకుంది. ఆమెతో పాటు మరో నలుగురు ఈ ప్రమాదంలో కన్నుమూశారు.
ప్రమాదానికి ముందు దృశ్యాలు వైరల్..
ప్రయాణానికి ముందు చేతిలో గిటార్‌తో విమానం వైపు వెళ్తున్న వీడియోను మెండోన్సా.. ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. విమానంలో ఆహారాన్ని తింటున్న దృశ్యాలను కూడా పోస్ట్ చేశారు. స్త్రీ వాద సమస్యలే ప్రధాన భూమికగా ఆమె పాటలు సాగేవి. మహిళా సాధికారిత కోసం ఆమె తన గళాన్ని ప్రపంచానికి వినిపించారు. బ్రెజిల్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన పాప్‌స్టార్ అయిన మెండోన్సా.. ప్రతిష్టాత్మకమైన లాటిన్ గ్రామీ పురస్కారాన్ని 2019లో అందుకున్నారు.