చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరగుతున్న తీరును ఆ దేశ మాజీ పోలీస్ అధికారి ఒకరు కళ్లకు గట్టినట్లు వివరించారు. ఆ దేశంలో మైనారిటీ ముస్లింలుగా ఉన్నా వీఘర్లను చిత్రహింసలకు గురి చేస్తున్న తీరును వెల్లడించారు. చైనాలో వీఘర్లపై జరుగుతున్న నేరాల గురించి తెలుసుకునేందుకు ఏర్పాటైన ట్రైబ్యునల్ ముందు ఆయన ఈ విషయాలు చెప్పారు. జూన్ 4 నుంచి 7 వరకు లండన్లో ఈ విచారణ జరిగింది.
2018లో జిన్జియాంగ్ రాష్ట్రంలో తాను విధులు నిర్వహించినప్పుడు పరిస్థితి ఎలా ఉందో మాజీ పోలీస్ అధికారి మాటల్లో...
" జిన్జియాంగ్లో రీ-ఎడ్యుకేషన్, ఐడీయాలజీ ట్రాన్స్ఫార్మేషన్ శిబిరాలు నిర్వహించే వాళ్లం. నిజానికి ఇక్కడ ఏమీ నేర్పించం. కానీ వాళ్ల ఆలోచనను, భావజాలాన్ని మార్చేందుకు బ్రెయిన్ వాష్ చేస్తాం. ఈ శిబిరాలకు తీసుకొచ్చేవారిలో వీఘర్లే అధికంగా ఉండేవారు. వీఘర్లను పోలీసులు ఉగ్రవాదులుగా భావించేవారు. వారు ఎలాంటి నేరాలు చేయకున్నా బలవంతంగా నేరం ఒప్పుకునేలా చేసేవారు. వాళ్ల బంధువులు కూడా ఉగ్రవాదులే అని చెప్పించే వాళ్లు. జైళ్లలో ఉండే వీఘర్లను చిత్రహింసలు పెట్టేవాళ్లం. మోకాళ్లపై కూర్చోబెట్టేవాళ్లం. వాళ్ల తలలకు ప్లాస్టిక్ బ్యాగులు కట్టి ఊపిరాడకుండా చేసేవాళ్లం. శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది ఏర్పడినప్పుడు బ్యాగులు తొలగించేవాళ్లం. వాళ్ల నోట్లో వాటర్ పైపులు పెట్టి ఊపిరితిత్తులకు నీరు వేగంగా చేరేలా చేసి హింసించే వాళ్లం. "