ఇరాన్ తన నిఘా డ్రోన్‌ను కూల్చివేయడంపై ఆగ్రహంగా ఉన్న అమెరికా ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అయితే దాడికి మొదట అనుమతించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అనంతరం ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారని తాజాగా పేర్కొంది.
అమెరికా నిఘా డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేయడం అతిపెద్ద తప్పుగా ట్రంప్ అభివర్ణించారు. ప్రతీకారంగా ఇరాన్ రాడార్, క్షిపణి బ్యాటరీలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాలని భావించారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అయితే అనంతర పరిణామాల్లో దాడి నిర్ణయాన్ని ఉన్నతాధికారులు విరమించుకున్నారని పేర్కొంది. భవిష్యత్తులో ప్రతీకార దాడులు జరిపే ప్రణాళికలు ఉన్నాయా లేదా అన్నది అస్పష్టంగా ఉందంది.
న్యూయార్క్ టైమ్స్ కథనాలపై స్పందించడానికి శ్వేతసౌధం, అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ నిరాకరించింది.
పతాకస్థాయికి ఉద్రిక్తతలు..?
ఇంతకు మునుపు.... తమ గగనతలంలోకి అక్రమంగా చొరబడిన అమెరికా నిఘా డ్రోన్‌ను కుల్చేశామని ఇరాన్ ప్రకటించింది. దాని శకలాలను తమ ప్రాదేశిక జలాల్లో స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేసింది. ఇందుకు సాక్ష్యంగా ఓ వీడియోనూ విడుదల చేసింది.