ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటైన పాకిస్థాన్ ప్రజాస్వామ్య ఉద్యమ(పీడీఎం) కూటమి భారీ బలప్రదర్శన నిర్వహించింది. ఈ ర్యాలీలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ర్యాలీ జరిగిన కరాచీలోని బాగ్-ఈ-జిన్నా ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. పార్టీ జెండాలు పట్టుకొని, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు ప్రజలు.
బిలావల్ భుట్టో జర్దారీ, మరియం నవాజ్, మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్, మెహమూద్ ఖాన్, మోహ్సిన్ దవార్ సహా పలువురు విపక్ష నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
మా లక్ష్యం అదే: మరియం
2018 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ఓట్లను దొంగలించారని అధికార పార్టీ లక్ష్యంగా ఆరోపణలు చేశారు ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్. ఓట్ల పవిత్రతను పునరుద్ధరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
"ప్రజలు ఇప్పుడు మనకంటే ముందున్నారు. ప్రజలకు ప్రాతినిథ్యం వహించడంలో మేము(ప్రతిపక్షాలు) కాస్త ఆలస్యం చేశాం. కానీ ఇప్పుడు పీడీఎం వేదికగా కలిశాం."