జపాన్‌లో ప్రఖ్యాత కార్టూన్ పాత్ర 'హలో కిట్టీ'. ఈ అందమైన కాల్పనిక బొమ్మకు ప్రపంచవ్యాప్తంగా బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. వీరి కోసమే కాకుండా విభిన్నంగా ఉండాలనుకునే వారి కోసం జపాన్‌లో ఈ పాత్ర ఇతివృత్తంతో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసింది పసోనా గ్రూప్ అనే టోక్యో సంస్థ.
జపాన్‌లోని అందమైన ద్వీపం అవాజీ. ఈ ద్వీప తీరంలో ఈ 'హలో కిట్టీ స్మైల్' రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ ఎండాకాలంలో ప్రత్యేకంగా హలోకిట్టీ టూర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు నిర్వాహకులు. ఇందులో ఈ పాత్ర ఇతివృత్తంగా ఉన్న బులెట్ రైలు, విమనాల్లో ప్రయాణంతో పాటు ఉండటానికి చిన్న కాటేజీలు లాంటివి ఉన్నాయి.
ఈ రెస్టారెంట్‌పై 11 మీటర్ల హలో కిట్టీ విగ్రహం ఉంటుంది. ఈ ప్రవేశ ద్వారం వద్ద కారులో హలో కిట్టీ, ఆవిడ ప్రియుడు డేనియల్ దర్శనమిస్తారు. ఈ భవనంలో దుకాణాలు, కేఫ్‌లు, దుకాణం, గ్యాలరీ, థియేటర్లు ఉన్నాయి.
హలో కిట్టి స్మైల్ అవాజీ పశ్చిమ తీరంలో ఉంది. ఇక్కడ సముద్రం, సుర్యాస్తమయం చాలా అందంగా ఉంటాయి. అవాజీ అందాలను ప్రపంచానికి చూపించాలనుకున్నాం. ప్రపంచ ప్రఖ్యాత హలో కిట్టీ పాత్ర ఇతివృత్తంగా రెస్టారెంట్‌ను నిర్మించి దీన్ని సాధించాలనుకున్నాం.
-అజూసా, హాలో కిట్టీ స్మైల్ ప్రతినిధి
మొదటి అంతస్తులో ఉన్న గ్యాలరీలో పర్యటకులు ఫోటోలు తీసుకోవచ్చు. థియేటర్లలో వక్రంగా ఉన్న గోడలపై థీమ్ బేస్డ్ చిత్రాలు తిలకించవచ్చు. ఇక్కడకు వచ్చే వారిలో 10 శాతం విదేశీయులే.