అరగంటలో అమెరికా చేరుకోగల చైనా బాహుబలి క్షిపణి! రిపబ్లిక్ ఆఫ్ చైనా 70వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. బీజింగ్ తియాన్మెన్ స్క్వేర్ వద్ద భద్రతా బలగాలు భారీస్థాయిల కవాతు నిర్వహించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఖండాంతర అణు క్షిపణులు, సూపర్ సోనిక్ స్పై డ్రోన్‌లతో చైనా శక్తినిప్రపంచానికి చాటిచెప్పేలా విన్యాసాలు సాగాయి. తర్వాత చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ జాతినుద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
'డ్రాగన్' బల ప్రదర్శన..
చైనా అత్యంత ఆధునిక ఆయుధాలను ఈసారి ప్రదర్శించింది. అర గంటలో అమెరికాను చేరుకునే బాలిస్టిక్ క్షిపణిని ఆవిష్కరించింది.
ప్రస్తుతం ప్రపంచంలోనే ఇది అత్యంత శక్తిమంతమైన క్షిపణిగా తెలుస్తోంది. ఈ క్షిపణి 15,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. కేవలం 30 నిమిషాల్లోనే అమెరికా చేరుకోగలదు. ఒకే సారి 10 వార్‌హెడ్ల(బాంబులు)ను తీసుకెళ్లే సామర్థ్యం దీనికుంది.
ఈ డ్రాగన్ క్షిపణి అమెరికా రక్షణ వ్యవస్థలను తప్పించుకొని ప్రయాణించగలడం విశేషం. దీనిని ఏడోతరం క్షిపణిగా సౌత్‌చైనా మార్నింగ్ పోస్టు పేర్కొంది. శబ్దవేగానికి దాదాపు 25 రెట్ల వేగంతో ప్రయాణించగలదు. ఇప్పటికే చైనా వద్ద 11,200 కిలోమీటర్లు ప్రయాణించే డాంగ్‌ఫెంగ్ క్షిపణి ఉంది.
దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఈ ఆయుధాన్ని ప్రదర్శించడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఇప్పటికే దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవులను నిర్మించి అక్కడ ఆయుధాలను మోహరించింది.
ఇదీ చూడండి:లైవ్: 'ఎస్సీ, ఎస్టీ చట్టం తీర్పు- 2018' ఉపసంహరణ