తెలంగాణ

telangana

ETV Bharat / international

పసిబిడ్డ హత్యకు తల్లి యత్నం- కాపాడిన శునకం - ఖననం

కన్నతల్లే కిరాతకంగా మారి పురిటి బిడ్డను సజీవంగా ఖననం చేసేసింది. అదంతా గమనించిన ఓ శునకం... ఆ బాలుడ్ని కాపాడింది. అమానుషంగా వ్యవహరించిన తల్లి... ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతోంది.

పసిబిడ్డ హత్యకు తల్లి యత్నం- కాపాడిన శునకం

By

Published : May 19, 2019, 2:54 PM IST

తొందరపాటు వల్ల గర్భవతైంది. సమయం మించిపోయింది. గర్భస్రావం కుదరలేదు. నెలలు నిండాయి. చివరకు బిడ్డకు జన్మనిచ్చింది. విషయం బయటపడకుండా దాచిపెట్టాలనుకుంది. కుటుంబ సభ్యుల కన్నుగప్పాలని చూసింది. పుట్టిన బిడ్డను పురిట్లోనే పాతిపెట్టి దారుణానికి ఒడిగట్టింది.

మృత్యుంజయుడు

కిరాతక కన్నతల్లి ఖననం చేసినా ఆ బిడ్డకు భూమిపై నూకలున్నాయి. కన్నతల్లే కనికరం చూపకుండా భూమిలో పాతిపెట్టినా... బతికి బయటపడ్డాడు ఆ పసిబిడ్డడు. కళ్లైనా తెరవని పసిగుడ్డు మృత్యుంజయుడుగా మారాడు. ఎలా?

బిడ్డను కాపాడిన శునకం

పురిటి బిడ్డను బతికుండగానే ఖననం చేసిన తల్లి బారి నుంచి కాపాడింది మనుషులు కాదు. మానవుడికి ప్రియమైన స్నేహితుడిగా పిలుచుకునే శునకం.
థాయ్​లాండ్​లోని బాన్ నాంగ్ ఖామ్ గ్రామంలో 15 ఏళ్ల అవివాహిత యువతికి బిడ్డ పుట్టాడు. అక్కడి సంప్రదాయం ప్రకారం అది తప్పు. విషయం తల్లిదండ్రులకు తెలియకుండా దాచిపెట్టాలనుకుంది. శిశువును ఓ పొలం వద్దకు తీసుకెళ్లి ఖననం చేసింది.

పింగ్ పాంగ్ అనే శునకం ఆ మహాతల్లి చేసిన దారుణానికి మూగ సాక్షి. వెంటనే భూమిని తవ్వటం మొదలు పెట్టింది. తన యజమానికి విషయం తెలిసేలా పెద్దగా మొరిగింది.
అప్రమత్తమైన స్థానికులు పసికందును ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ధృవీకరించారు.

"పింగ్ పాంగ్ ఓ కారు ప్రమాదంలో ఓ కాలు కోల్పోయింది. అయినా నాకు పొలం వద్ద సహాయంగా ఉంటుంది. నా పశువులకు తోడుంటుంది. ఊరంతా దాన్ని ప్రేమిస్తారు."
-నిసాయిఖా, పింగ్ పాంగ్ యజమాని

కిరాతక తల్లికి కటకటాలు...

బిడ్డను చంపాలనుకున్న తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసు నమోదు చేశారు.
శిశువును పెంచుకునేందుకు ఆ యువతి కుటుంబసభ్యులు అంగీకరించారు.

ABOUT THE AUTHOR

...view details