ముంబయి ఉగ్రదాడి కేసులో కీలక నిందితుడైన పాకిస్థాన్ సంతతికి చెందిన కెనడా వ్యాపారవేత్త తహవ్వూర్ రాణా.. తనను భారత్‌కు అప్పగించే అభ్యర్థనను న్యాయస్థానంలో వ్యతిరేకించారు. తనపై మోపిన అభియోగాల నుంచి గతంలోనే నిర్దోషిగా బయటపడ్డానని వాదించారు. ఉగ్రవాది డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ చిన్ననాటి స్నేహితుడైన 59 ఏళ్ల రాణాను అమెరికాలోని లాస్‌ఏంజెలెస్ నగరంలో గతేడాది జూన్ 10న రెండోసారి అరెస్టు చేశారు. భారత్ నుంచి వచ్చిన అప్పగింత అభ్యర్థన మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
గతంలో నిర్దోషిగా..
2008 ముంబయి ఉగ్ర దాడులకు పాకిస్థాన్ అమెరికన్, లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ కుట్రదారు. అనంతరం అతను న్యాయస్థానంలో అప్రూవర్‌గా మారాడు. ప్రస్తుతం అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా రాణా అప్పగింత అభ్యర్థనను వ్యతిరేకిస్తూ అతని న్యాయవాది అమెరికా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. భారత్-అమెరికాల మధ్య కుదిరిన నేరస్థుల అప్పగింత ఒప్పందంలోని ఆరో అధికరణం రాణాకు వర్తించదని పేర్కొన్నారు. గతంలో రాణాపై మోపిన అభియోగాల్లో అతను నిర్దోషిగా విడుదలవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:స్వేచ్ఛ కోసం సింధ్ ప్రజల పోరుబాట