అమెరికా, చైనాల మధ్య వాణిజ్య, ప్రయాణ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా చైనా విమానాలపై నిషేధం విధించాలని నిర్ణయించింది అగ్రరాజ్యం. చైనాకు చెందిన 4 విమాన సంస్థల ప్రయాణ విమానలపై నిషేధం ఉంటుందని అమెరికా రవాణా శాఖ వెల్లడించింది. అమెరికా నుంచి టేకాఫ్, ల్యాండింగ్లపై జూన్ 16 నుంచి నిషేధం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.
కరోనా విజృంభణ నేపథ్యంలో చైనాకు విమానాలు నిలిపివేశాయి అమెరికాకు చెందిన డెల్టా, యునైటెడ్ ఎయిర్లైన్స్ సంస్థలు. అయితే.. ఈ వారంలో విమానాలను పునరుద్ధరించాలని ప్రయత్నించినప్పటికీ.. వాటికి అనుమతులు ఇవ్వలేదు చైనా. ఇందుకు ప్రతీకార చర్యగానే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.