ఉగ్రవాదాన్ని కట్టడి చేయటంలో పాకిస్థాన్ పూర్తిగా విఫలమైందని పేర్కొంది అగ్రరాజ్యం అమెరికా. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల నిధుల సేకరణ, నియామకాలు, శిక్షణను అడ్డుకోవటంలో ఆ దేశం పూర్తిగా విఫలమైందని స్పష్టం చేసింది.
2018 సంవత్సరానికిగానూ తీవ్రవాదంపై వార్షిక నివేదికను విడుదల చేసింది అమెరికా విదేశాంగ శాఖ. ఈ సందర్భంగా పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేసింది.
అఫ్గానిస్థాన్‌కు మద్దతు తెలిపినా..
అఫ్గానిస్థాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య రాజకీయ సయోధ్యకు పాకిస్థాన్ మద్దతు ప్రకటించినప్పటికీ... అమెరికా, అఫ్గాన్ బలగాలకు ముప్పుగా మారిన పాక్ ఆధారిత తీవ్రవాద సంస్థలు, హక్కానీ నెట్వర్క్ (హెచ్‌క్యూఎన్)ను నియంత్రించలేదని పేర్కొంది. జులైలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు లష్కరే తొయిబాతో సంబంధమున్న అభ్యర్థులనూ అనుమతించిందని గుర్తుచేసింది.
పాకిస్థాన్ జాతీయ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం దేశంలో ఎలాంటి ఉగ్రవాద సంస్థలు పనిచేయకూడదని పిలుపునిచ్చినప్పటికీ.. 2018 నుంచి పాక్ భూభాగంలో పనిచేస్తున్న హక్కానీ నెట్వర్క్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలు దేశం వెలుపల దాడులు చేస్తూనే ఉన్నాయని పేర్కొంది అమెరికా విదేశాంగ శాఖ.
ఆసియా పసిఫిక్ గ్రూప్ ఆన్ మనీ లాండరింగ్ (ఏపీజీ)లో సభ్య దేశమైన పాకిస్థాన్.. అక్రమ నగదు బదిలీ, ఉగ్రవాదుల నిధుల సేకరణను అడ్డుకుంటామని అంగీకరించింది. దీనిని ఉగ్రవాద నిర్మూలన చట్టం కింద నేరంగా పరిగణిస్తున్నప్పటికీ.. అమలు చేయటంలో విఫలమైందని అమెరికా పేర్కొంది.
తోసిపుచ్చిన పాక్..
అమెరికా విడుదల చేసిన నివేదికను పాకిస్థాన్ తోసిపుచ్చింది. 2018లో పలు ఉగ్రదాడులు జరిగినప్పటికీ.. ప్రస్తుతం ఉగ్రదాడులు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొంది.
ఇదీ చూడండి: పాక్‌లో 'ఆజాదీ మార్చ్'.. ఇమ్రాన్ రాజీనామాకు డిమాండ్