అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందితే భారత్‌కు అధిక ప్రాధాన్యమిస్తానని డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ప్రకటించారు. భారత్‌ను సహజ భాగస్వామిగా అభివర్ణించిన ఆయన.. తాను అధ్యక్షుడైతే రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
బీకాన్ సీఈఓ అలాన్ లెవెంథర్ నిర్వహించిన వర్చువల్ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు బైడెన్. ఈ సందర్భంగా అమెరికాకు గతంలో 8 ఏళ్లపాటు ఉపాధ్యక్షుడిగా కొనసాగిన బైడెన్‌ను భారత్‌తో సంబంధాలపై అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు.
"మా భద్రత కోసం భారత్‌తో ప్రాంతీయ భాగస్వామ్యం అవసరం. నిజం చెప్పాలంటే వాళ్లకు అంతే ముఖ్యం. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మన దేశాల భద్రతకు చాలా ముఖ్యం. నేను అధికారంలో ఉన్న సమయంలోనే భారత్- అమెరికా పౌర అణు ఒప్పందం జరిగింది. ఒబామా-బైడెన్ నాయకత్వం తరహాలోనే నేను అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది."