మహిళలను పాశవికంగా అత్యాచారం చేస్తాడు. ఆ తర్వాత సుత్తితో చావబాదుతూ రాక్షసానందం పొందుతాడు. చావుకు, బతుక్కి మధ్య ప్రాణాలు కొట్టుమిట్టాడుతుండగా కాసేపు వదిలేస్తాడు. కాస్త స్పృహలోకి వచ్చాక మళ్లీ ఘోరంగా దాడి చేసి చంపుతాడు. తర్వాత బాధితురాళ్ల చెవి పోగులను తీసుకుని ఇంట్లో దాచుకుంటాడు. ఇలా ఎంతో మంది మహిళలను చిత్రవధ చేసి చంపిన నరరూప రాక్షసుడు, అమెరికాలో 'ది డేటింగ్ గేమ్ కిల్లర్'గా పేరుపొందిన రోడ్నీ జేమ్స్ అల్కాలా(77) మరణించాడు. మరణశిక్ష కోసం ఎదురుచూస్తూ కాలిఫోర్నియాలోని కొర్కోరన్ జైలులో ఉన్న అల్కాలా.. సహజ కారణాలతో తుది శ్వాస విడిచినట్లు అధికారులు తెలిపారు.
టీవీ షోలో పాల్గొని...
ఏడుగురు మహిళల హత్య కేసుల్లో అతడిపై నేరం రుజువైనా, వాస్తవానికి తన చేతిలో 130 మందికి పైగా హతమై ఉండొచ్చని అధికారులు విశ్వసిస్తున్నారు. 1968లో 8 ఏళ్ల బాలికపై, 1974లో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన అల్కాలా.. 1978లో 'ది డేటింగ్ గేమ్' టీవీ షోలో పోటీదారుగా పాల్గొన్నాడు. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడే ముందు ఫొటోలు తీసే అలవాటున్న అల్కాలా.. ఆ షోలో తనను ఫొటోగ్రాఫర్‌గా పరిచయం చేసుకున్నాడు. అందులో విజేతగానూ నిలిచాడు. ఈ షోతోనే అతడికి 'ది డేటింగ్ గేమ్ కిల్లర్' అని పేరొచ్చింది.