తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. 125కుపైగా దేశాల్లో విస్తరించిన వైరస్.. దాదాపు 4 వేల 600మందిని పొట్టనబెట్టుకుంది. వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కేంద్రమైన చైనాలో తగ్గుముఖం పట్టినప్పటికీ ఐరోపా దేశాల్లో ప్రమాదకరంగా మారింది. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ఇటలీలో మృతుల సంఖ్య వేయి దాటింది.

Corona effact on world nations
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి

By

Published : Mar 13, 2020, 6:08 AM IST

Updated : Mar 13, 2020, 9:20 AM IST

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి

ప్రపంచ మహమ్మారిగా మారిన కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. 125కుపైగా దేశాలకు విస్తరించిన కరోనా, చైనాలో తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇతర దేశాల్లో ప్రమాదకరంగా మారింది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 70 శాతం ఐరోపా​లోనే నమోదవుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ లక్షా 33వేల మందికిపైగా సోకిన వైరస్, 4,600 మందిని బలి తీసుకుంది. చైనాలో 80,700 మంది వ్యాధి బారిన పడగా 3,169 మంది చనిపోయారు. ఇటలీలో మృతుల సంఖ్య వేయి దాటింది. గురువారం ఒక్కరోజే 189 మంది చనిపోయారు. కొత్తగా 2,651 మందికి వైరస్‌ సోకినందున కేసుల సంఖ్య 15 వేలు దాటింది. ఈ నేపథ్యంలో చికిత్సా సాయం అందించేందుకు చైనా వైద్య నిపుణుల బృందం ఇటలీ వెళ్లింది.

ఇరాన్‌లో తాజాగా 75 మంది మరణించగా... మొత్తం మృతుల సంఖ్య 429కి చేరింది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాడేందుకు 37 వేల కోట్ల రుణం కావాలని ఇరాన్‌ ఐఎమ్​ఎఫ్​ను కోరింది. ఖతార్‌లో 238 కేసులు నమోదు కాగా విద్యాసంస్థలను మూసేశారు. గయానాలో తొలిమరణం సంభవించింది.

ఆంక్షల పర్వం

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 500 కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా న్యూయార్క్‌లో ఆంక్షలు విధించారు. ప్రఖ్యాత డిస్నీల్యాండ్, బ్రాడ్​వేలను మూసివేశారు.​

బెల్జియం, రోమ్‌లో చర్చిలను మూసివేశారు. 2 వారాలపాటు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ఐర్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనాను అత్యంత దారుణ ప్రజా ఆరోగ్య సంక్షోభంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. బ్రిటన్‌లో 590 కేసులే నమోదైనప్పటికీ ఈ సంఖ్య 5 నుంచి 10 వేల మధ్యలో ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు కనిపించినందున తన భార్య సోఫియాతోపాటు తాను స్వీయ నిర్భంధంలో ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రకటించారు.

స్పెయిన్‌లో ఓ మంత్రికి కరోనా పాజిటివ్​గా వచ్చిన నేపథ్యంలో స్పెయిన్ మంత్రివర్గం, రాజవంశీకులు పరీక్షలకు హాజరయ్యారు. ఇటీవలే డొనాల్డ్‌ ట్రంప్‌ను కలిసిన బ్రెజిల్ అధికార ప్రతినిధికి సైతం కరోనా పాజిటవ్‌గా తేలింది. మరోవైపు కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న తరుణంలో టోక్యో ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని ట్రంప్ సూచించారు.

వాయిదా

అంగారకుడిపైకి రోబోను పంపించేందుకుగాను రష్యా-ఐరోపా సంయుక్తంగా తలపెట్టిన మిషన్​ రెండేళ్లపాటు వాయిదా పడింది. వాస్తవానికి ఈ ఏడాది చివర్లో ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉంది. కరోనా కలకలం, ఇతర సాంకేతిక అంశాల కారణంగా 2020కు వాయిదా పడింది.

అమెరికానే తెచ్చింది

అమెరికా సైన్యమే కరోనాను వుహాన్​కు తీసుకొచ్చి ఉండొచ్చని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధుల్లో ఒకరైన ఝావో లిజియాన్ ఆరోపించారు. చైనాలో కంటే ముందే అమెరికాలో ఈ వైరస్ జాడ కనిపించినట్లు తెలుస్తోందని ఆయన అన్నారు.

ఇదీ చూడండి:ఇటలీలో 1000 దాటిన మరణాలు- ప్రధాని భార్యకు వైరస్​!

Last Updated : Mar 13, 2020, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details