తెలంగాణ

telangana

ETV Bharat / international

'సత్సంబంధాలను పునరుద్ధరించుకుందాం రండి'

అమెరికా అధ్యక్షునిగా ట్రంప్​ ఉన్నంతకాలం అగ్రరాజ్యంపై అక్కసు వెళ్లగక్కుతూ వచ్చిన చైనా... నేడు సత్సంబంధాల పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తోంది. ప్రత్యేకించి వాణిజ్యపరంగా కోలుకోలేని దెబ్బతిన్న డ్రాగన్​కు బైడన్​ ఎన్నికతో కొత్త ఆశలు చిగురించాయి. తిరిగి ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం చైనా చర్చలకు పిలుపునిచ్చింది

china would like to offer meeting with america on trade deals
సత్సంబంధాలను పునరుద్ధరించుకుందాం రండి: చైనా

By

Published : Dec 8, 2020, 10:20 PM IST

అమెరికాతో నెలకొన్న విభేదాలకు ముగింపు పలికి, సత్సంబంధాలను పునరుద్ధరించేందుకు చైనా అడుగులు వేస్తోంది. ఈ విషయంలో అగ్రరాజ్య అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్‌పైనే ఆశలు పెట్టుకుంది. ట్రంప్‌ హయాంలో అమెరికాతో చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా డ్రాగన్‌ దేశానికి వాణిజ్యపరంగా ఇబ్బందులు తప్పలేదు. ట్రంప్‌ తీరుతో విసిగిపోయిన చైనాకు.. బైడెన్‌ గెలుపుతో కొత్త ఆశలు చిగురించాయి. తాజాగా అమెరికా-చైనా వాణిజ్య సదస్సులో విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తించాయి.

'అమెరికాలోని కొందరు సైద్ధాంతికంగా మాతో విభేదించడం, ప్రచ్ఛన్న యుద్ధం చేయాలన్న మానసిక ధోరణితో వ్యవహరించడం వల్లే ద్వైపాక్షిక సంబంధాలు బెడిసికొట్టాయి. ఉమ్మడి ప్రయోజనాల కోసం పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకుని, సంబంధాలను గాడిలో పెట్టుకోవాల్సిన అవసరముంది. చర్చల ద్వారా దీన్ని సాధించాలి. చైనా విషయంలో అమెరికా త్వరలోనే హేతుబద్ధ విధానంతో ముందుకొస్తుందని ఆశిస్తున్నా' అని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా-చైనా సంబంధాలనూ, పరస్పర విశ్వాసాన్నీ పెంపొందించేందుకు.. త్వరలో అధికార పగ్గాలు చేపట్టనున్న బైడెన్‌ యంత్రాంగం ఉన్నతస్థాయి సంప్రదింపులు చేపట్టే వీలుందని చైనా అధికార మీడియా వర్గాలు కూడా వెల్లడించాయి.

ఇరాన్‌తో అణుఒప్పందంలో తిరిగి చేరొద్దు: నిక్కీ హేలీ

ఇరాన్‌తో అణు ఒప్పందంలో తిరిగి చేరాలన్న జో బైడెన్‌ ప్రణాళికను ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ వ్యతిరేకించారు. ఆ ఒప్పందంలో మళ్లీ భాగస్వామిగా మారితే అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. 'ఇరాన్‌ విశ్వసనీయ భాగస్వామి కాదు. ఆ దేశం యురేనియం నిల్వలను పెంచుకుంటూనే ఉంది. ఇజ్రాయెల్, అమెరికాలను నాశనం చేయాలన్న పిలుపులనూ కొనసాగిస్తోంది' అని ట్విటర్‌లో హేలీ వ్యాఖ్యానించారు. ఒబామా ప్రభుత్వ హయాంలో ఇరాన్‌తో అణు ఒప్పందంపై అమెరికా సంతకం చేయగా.. 2018లో ట్రంప్‌ ప్రభుత్వం దాన్నుంచి ఏకపక్షంగా వైదొలిగిన సంగతి గమనార్హం.

ఇదీ చూడండి: 'పాక్​, చైనాలో ఆందోళనకరంగా మత స్వేచ్ఛ'

ABOUT THE AUTHOR

...view details