అమెరికాకు ప్రధాన ప్రత్యర్థి అయిన చైనాకు ఏ దేశాల మద్దతూ లేదని.. తమకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మిత్రదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు అగ్రరాజ్యం రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్. చైనాను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రక్షణ శాఖకు బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"చైనాకు మిత్రులు ఎవరూ లేరు. మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల మద్దతు ఉంది. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది మనకు మరింత బలం చేకూరుస్తున్న విషయం. బంధం బలోపేతం చేసుకునేందుకు ఇటీవల ఆ దేశాల్లో పర్యటించాం కూడా. సైబర్ స్పేస్లో అగ్రగామిగా నిలిచేందుకు చైనా అడుగుల వేస్తున్న విషయం తెలిసిందే. అమెరికా కూడా అదే స్థాయి పోటీని ఇస్తుందని భావిస్తున్నాను."
-లాయిడ్ ఆస్టిన్, రక్షణ మంత్రి