తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​పై విమర్శల జడివాన స్వయంకృతమే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ కాలం ముగిసింది. దూకుడుగా వ్యవహరించే ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ఎందుకు విఫలమయ్యారు? విమర్శల మధ్య పదవిని విడవాల్సిన స్థితికి ఎందుకు చేరుకున్నారు? ఈ విషయాలపై ప్రత్యేక కథనం.

trump, president, biden
ట్రంపరి స్వయంకృతం!

By

Published : Jan 20, 2021, 8:26 AM IST

డొనాల్డ్‌ ట్రంప్‌.. చాలామంది అమెరికా అధ్యక్షుల్లా అమెరికా ఆధిపత్యాన్ని, సామ్రాజ్యవాద విస్తరణకాంక్షను చాటలేదు. బుష్‌లా.. క్లింటన్‌లా కొత్తగా యుద్ధశంఖాలు పూరించలేదు. వాటిని కొనసాగించే ప్రయత్నమూ చేయకుండా అఫ్ఘాన్‌లాంటి చోట్ల నుంచి అమెరికా సైన్యాలను వెనక్కి రప్పించటం మొదలెట్టారు. దశాబ్దాలుగా రావణకాష్టమైన మధ్యప్రాచ్యంలో శాంతికి బీజాలు పడ్డవి ట్రంప్‌ హయాంలోనే! ఉప్పూనిప్పూలాంటి ఇజ్రాయెల్‌తో అరబ్‌ దేశాలివాళ దోస్తీ చేసుకుంటున్నాయంటే అందులో ట్రంప్‌ యంత్రాంగం పాత్ర కీలకం!

ప్రపంచంపైకి వుహాన్‌ వైరస్‌ విరుచుకుపడుతుంటూ ఎవ్వరూ నోరు మెదపని సమయంలో... ఇది చైనా వైరస్‌ అంటూ బహిరంగంగా విమర్శించి చైనాను కాసింతైనా ఉక్కిరిబిక్కిరి చేసిన గడసరితనం ట్రంప్‌దే!

అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా ట్రంప్‌ హయాంలో (కరోనా కాలం తప్పించి) స్థిరంగా అభివృద్ధి చెందింది. ఆ దేశ ఆర్థికవ్యవస్థను ప్రతిబింబించే స్టాక్‌మార్కెట్‌ అద్భుతమైన లాభాలు చవిచూసింది.

నిరుద్యోగశాతం గత 50 సంవత్సరాల్లో ఎన్నడూలేనంత తక్కువ స్థాయికి పడిపోయింది ట్రంప్‌ హయాంలోనే! (కరోనా కాలం తప్పించి)

అయినా ఇవాళ ఓ దోషిగా అమెరికా పరువు తీసినవాడిగా.. అధ్యక్ష పదవికి అనర్హుడనే ముద్రతో విమర్శల జడివానలో తడుస్తూ పదవి నుంచి దిగిపోతున్నాడు! ఎందుకిలా అయ్యాడు? ఎక్కడ తప్పటడుగులు వేశాడు?

అనిశ్చిత నిర్ణయాలు..

తన యంత్రాంగంపై తనకే నమ్మకం లేకపోవటం ట్రంప్‌లోని పెద్దలోపం! తను నియమించుకున్నవాళ్ళను తానే రోజూ విమర్శించటం, ఏ అధికారిపై ఎప్పుడు వేటు వేస్తారో.. ఎందుకు వేస్తారో తెలియకపోవటం.. అమెరికా ప్రయోజనాల పేరిట అనేక దేశాల పౌరులపైనా, వీసాలపైనా ఆంక్షలు, నిషేధాలు విధించటం... రోజుకో ప్రకటనతో గందరగోళం అనిశ్చిత వాతావరణాన్ని సృష్టించటం. మొత్తానికి ఇలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా అమెరికా ఎలా ఎన్నుకున్నదబ్బా అని ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా ట్రంప్‌ వ్యవహరించారు.

హుందాతనానికి తిలోదకాలు..

అమెరికా అధ్యక్షుడనగానే మాటలో, తీరులో ఒకింత హుందాతనాన్ని, ఇచ్చిపుచ్చుకునే గౌరవాన్ని, అధికార దర్పాన్ని ఆశిస్తారంతా! కానీ ట్రంప్‌లో అదే లోపించింది. అమెరికా అధ్యక్షుడైనా వ్యాపారవేత్తలానే ప్రవర్తించటం ట్రంప్‌ను దెబ్బతీసింది! వాక్చతురత ప్రదర్శించాల్సిన చోట వాచాలత్వం ఎక్కువైంది. నోటికేదొస్తే అది ట్విటర్‌లో పెట్టేయటం, పట్టువిడుపులు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేకపోవటం.. అసందర్భ పరాచికాలు... ఇవన్నీ అమెరికా అధ్యక్ష పదవికి శోభనివ్వవనే సంగతిని ట్రంప్‌ గుర్తించలేదు. మొత్తానికది ఇంటా బయటా చాలామందికి- అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్‌ సరిపోడనే భావన కల్పించింది.

చట్టాలను తోసిరాజనటం

చట్టాల పట్ల అగౌరవంగా మాట్లాడటం; అమెరికన్లందరికీ కాకుండా ఒకవర్గానికి నాయకుడిగా, వారి భావాలను ప్రతిబింబించటం.. ఇవన్నీ ఆయనపైనా తటస్థుల్లోనూ వ్యతిరేకతను పెంచాయి. ఎన్నికల వేళ కూడా చట్టాలపైనా, కోర్టులపైనా, చట్ట సభలపైనా ట్రంప్‌ నోరుజారారు. చివరకు అమెరికా క్యాపిటల్‌పై తన మద్దతుదారులు దాడి చేసేలా వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం.. ఆనక హింసకు నేను వ్యతిరేకం అనటం ట్రంపరితనానికి పరాకాష్ఠ.

సర్దిచెప్పాల్సింది పోయి..

అమెరికా సమాజంలో అంతర్గతంగా రగులుతున్న అసమానతలను ఆర్పి.. దేశానికి దిక్సూచిగా నిలవాల్సిన అధ్యక్షుడు ట్రంప్‌ ఆ మంటల్లో చలికాచుకోవటానికి ప్రయత్నించటం ఆయన గౌరవాన్ని, హుందాతనాన్ని మరింత దిగజార్చింది. బ్లాక్‌ మ్యాటర్స్‌ ఉద్యమం సమయంలో, తర్వాత అధ్యక్ష ఎన్నికకు ముందర బైడెన్‌తో ముఖాముఖి సమయంలో శ్వేతజాత్యహంకార బృందాలకు బహిరంగంగానే ట్రంప్‌ మద్దతు పలకటం గమనార్హం.

ఆయన పేరు ఎలా నిలుస్తుంది?

అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థల్లోని అనేక బలహీనతలకు, లోపాలకు, డొల్లతనానికి ప్రతీక ట్రంప్‌! ట్రంపిజం కేవలం ట్రంప్‌కే పరిమితమైంది కాదు. ట్రంప్‌తో వచ్చిందికాదు.. ట్రంప్‌ వెళ్ళగానే మాయమయ్యేదీ కాదు. అణచివేయటం కాకుండా అర్థం చేసుకొని వారినీ ఎలా సమ్మిళితం చేసుకొని వెళతారనేది బైడెన్‌, ఆ తదనంతర ప్రభుత్వాల ముందున్న సవాలు! ట్రంప్‌ అనుభవాలతో తమ ప్రజాస్వామ్య వ్యవస్థల్లోని బలహీనతలను సరిదిద్దుకునే అవకాశం అమెరికా ప్రజలకు, అక్కడి చట్ట సభలకు లభించింది. ఆ రకంగా ట్రంప్‌ అమెరికాకు మేలే చేశాడు! ఆ మేలును అమెరికా అందుకుంటుందా లేక సంయుక్త రాష్ట్రాల (యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌) అమెరికా; పార్టీలపరంగా, జాతుల పరంగా విభజిత (డివైడెడ్‌)గా కొనసాగుతుందా? అనేది అంతా ఆసక్తిగా వేచి చూస్తున్న వాస్తవం!

ఇదీ చదవండి :బైడెన్​ ప్రమాణ స్వీకారోత్సవం షెడ్యూల్​ ఇలా..

ABOUT THE AUTHOR

...view details