తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఇదాయ్​' ప్రకోపం-150 మంది బలి - రెడ్​ క్రాస్​

ఇదాయ్​ తుపాను సృష్టించిన విలయానికి ఆఫ్రికా ఖండంలోని దక్షిణ ప్రాంత దేశాలు మొజాంబిక్, మలావి, జింబాబ్వే విలవిలలాడిపోయాయి. సుమారు 150 మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు.

'ఇదాయ్​' విలయానికి 150 మంది మృతి

By

Published : Mar 17, 2019, 11:12 AM IST

Updated : Mar 17, 2019, 1:20 PM IST

ఆఫ్రికా దేశాలు మొజాంబిక్​, జింబాబ్వే, మలావిలో 'ఇదాయ్​' తుపాను​ బీభత్సం సృష్టించింది. ఈ భీకర తుపానులో చిక్కుకుని సుమారు 150 మంది వరకు మృతిచెందారు. వందలాది మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు.

సహాయక చర్యలు ముమ్మరం...

ఈ తుపాను ఆఫ్రికాదక్షిణ ప్రాంత దేశాలైన మొజాంబిక్​, జింబాబ్వే, మలావిల్లోని సుమారు 15 లక్షల మందిపై ప్రభావం చూపిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. రంగంలోకి దిగిన ఐరాస సహాయక బృందాలు, రెడ్​ క్రాస్​ సంస్థ సహాయక చర్యలు చేపట్టాయి. బాధితులకు ఆహారం, మందులు అందజేస్తున్నాయి.

జింబాబ్వేలోని ఓ పాఠశాలలో చిక్కుకున్న 197 మంది విద్యార్థులను రక్షించడానికి సైన్యం కృషి చేస్తోంది. నేలపై దిగడానికి అవకాశం లేకపోవడం వల్ల హెలికాఫ్టర్ల సాయంతో రక్షణ చర్యలు చేపట్టింది.

"మలావిలో తుపాను తర్వాత ప్రజలు మరో ముప్పు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వరదలు ముంచెతున్నాయి"

- ఇంటర్నేషనల్​ ఫెడరేషన్ ఆఫ్​ రెడ్​క్రాస్​

మలావి, మొజాంబిక్​లోని ప్రజలకు సాయం చేయడానికి దక్షిణాఫ్రికా ఒక ఎయిర్​క్రాఫ్ట్​తో సహా 10 మంది వైద్యులను పంపించింది.

తుపాను విలయం..

ఇదాయ్​ తుపాను ముందుగా మొజాంబిక్​లోని ప్రముఖ నౌకాశ్రయం బెయిరాను బలంగా తాకింది. ఈ తుపాను ధాటికి బెయిరా నగరం తీవ్రంగా నష్టపోయింది. అక్కడి విమానాశ్రయం మూసివేశారు. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. అక్కడ నుంచి తుపాను పశ్చిమ దిశగా పయనించి జింబాబ్వే, మలావిలను తాకింది.

తుపాన్​ ధాటికి పాఠశాలలు, కార్యాలయాలు, వైద్యశాలలు, పోలీసు స్టేషన్లు అన్నీ నాశనమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో టెలిఫోన్​, విద్యుత్​ కనెక్షన్లు తెగిపోయి, రహదారులు చెడిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



Last Updated : Mar 17, 2019, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details