పశ్చిమాఫ్రికా దేశం బుర్కినాఫాసోలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం జరిపిన దాడుల్లో దాదాపు 36 మంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. నగ్రావోగో ప్రాంతంలోని ఓ మార్కెట్‌పై దాడి చేసి... తగలబెట్టడం ద్వారా ముష్కరులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతరం పక్కనే ఉన్న గ్రామంలోకి వెళ్లి మరో నలుగురిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి మొత్తం 36 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడుల్లో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
యువకులకు ఆయుధాలిచ్చిన ప్రభుత్వం...
బుర్కినాఫాసో ప్రభుత్వం ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించింది. ముష్కరమూకల ఏరివేత కోసం జరుగుతన్న పోరులో ప్రజలు సహకరించాలని అభ్యర్థించింది. అర్హులైన యువకులకు ఆయుధాలు ఇచ్చి వారిని ఈ పోరులో భాగం చేసేందుకు సంబంధించిన ఓ బిల్లును అక్కడి పార్లమెంటు ఆమోదించింది.
2015లోనూ బుర్కినాఫాసోతో సహా పొరుగు ప్రాంతాలైన మాలి, నైగర్లపై జరిగిన వరుస దాడుల్లో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాదీ ముష్కరులు మూడు సాహెల్ దేశాలపై దండెత్తారు. అప్పుడు సుమారుగా 4000 మంది మృత్యువాతపడ్డారని ఐక్యరాజ్యసమితి నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి:గర్భిణిని 6 కిలోమీటర్లు మోసుకెళ్లిన సీఆర్పీఎఫ్ బృందం