వరలక్ష్మి శరత్ కుమార్.. ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కువగా వినపడుతోన్న పేరు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ సినిమాలు చేయడమే కాకుండా హిట్లు కూడా అందుకుంటోంది. అయితే ఆమె ఇటీవల నటించిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్లుగా నిలిచాయి! ఈ రెండు సినిమాల్లో నటించిన హీరోలు కొంతకాలంగా ఫ్లాప్‌లతో నిరాశలో కూరుకుపోయిన వారే. దీంతో వరలక్ష్మి ఎంట్రీ ఈ ఇద్దరికీ లక్కీగా మారిందంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఆ విషయాలను చూద్దాం..
క్రాక్
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం క్రాక్. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా, శ్రుతి హాసన్ హీరోయిన్గా చేసింది. ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో సముద్రఖని కనిపించగా.. ఆయన పక్కన జయమ్మ పాత్రలో ఆకట్టుకుంది వరలక్ష్మి. లేడీ విలన్‌గా ఆమె కనిపించిన తీరు, డైలాగ్ డెలివరీ ప్లసయ్యాయి. ఈ సినిమాతో వరలక్ష్మి టాలీవుడ్లో తొలి హిట్ అందుకున్నట్లైంది. చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ కూడా దీనితో మళ్లీ హిట్ ట్రాక్‌లో వచ్చారు.
నాంది
అల్లరి నరేశ్ హీరోగా, విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన చిత్రం నాంది. ఇందులో న్యాయవాదిగా మెరిసింది వరలక్ష్మి శరత్ కుమార్. ఇది ఈ మూవీకి పెద్ద ప్లస్ అయింది! 'సుడిగాడు' తర్వాత దాదాపు ఎనిమిదేళ్లు హిట్ అందుకోలేకపోతున్న నరేశ్‌కు ఈ సినిమా మంచి కిక్ ఇచ్చే విజయం అందించింది.
ఈ రెండు చిత్రాల విడుదలకు ముందు ఇద్దరు హీరోలు ఫ్లాప్‌లతో ఉన్నారు. వీరు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకోవడం వల్ల వరలక్ష్మి కాస్త వారి పాలిట అదృష్టలక్ష్మిగా మారిపోయింది. భవిష్యత్‌లోనూ ఆమె మరిన్ని హిట్స్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కెరీర్
2012లో విడుదలైన తమిళ చిత్రం 'పొడా పొడి'తో నటిగా అరంగేట్రం చేసింది వరలక్ష్మి. తర్వాత 2014లో మాణిక్య చిత్రంతో కన్నడ పరిశ్రమకు పరిచయమైంది. 2015లో కసాబా చిత్రంతో మలయాళ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈమె నటించిన విక్రమ్ వేదా, విస్మయ, మాణిక్య, కసాబా చిత్రాల్లో నటనకుగానూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత విజయ్ సర్కార్, విశాల్ పందెంకోడి 2 చిత్రాల్లో లేడీ విలన్ పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించింది. 2019లో సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ ఎల్ఎల్బీ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది.