Mahesh Babu waits in queue: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడటమేంటని అనుకుంటున్నారా? స్టార్ హీరో కాబట్టి మీకా సందేహం రావడం సహజమే. ఎప్పుడూ లేనిది మహేశ్ ఇలా చేశాడంటే అందరికీ ఆసక్తి, ఆశ్చర్యమే. అందుకే సంబంధిత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన 'సర్కారు వారి పాట' సినిమా చూడ్డానికో, మరో చిత్రాన్ని వీక్షించడానికో ఆయన అలా చేయలేదు. తాను నిర్మించిన 'మేజర్' ప్రచారంలో భాగంగానే ఆయన ఓ థియేటర్ ముందు క్యూలో నించున్నారు. యూట్యూబర్, డిజిటల్ క్రియేటర్ నిహారిక ఎన్‌ఎంతో కలిసి తమ సినిమాను విభిన్నంగా ప్రమోట్ చేశారు. ఆ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నిహారిక సినిమా టికెట్ కోసం లైన్‌లో నిలబడగా ఆమె ముందుకు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. మధ్యలో చిత్ర కథానాయకుడు అడివి శేష్ రాగానే వాగ్వాదం చోటుచేసుకుంటుంది. ఈలోపు మహేశ్‌బాబు వచ్చి క్యూలో నిలబడతారు. ఆయన్ను చూడగానే నిహారిక సర్‌ప్రైజ్ అవుతుంది. "మా స్నేహితులను కూడా పిలవొచ్చా" అని మహేశ్ అడగ్గానే ఓకే అంటుంది. దాంతో లైన్ పెరుగుతుంది. ఫోన్ నంబరు అడిగేలోపు మహేశ్ వెళ్లిపోవడం వల్ల నిహారిక అసహనం వ్యక్తం చేస్తుంది.
ముంబయి ఉగ్రదాడుల్లో ప్రాణాలు విడిచిన వీరజవాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా రూపొందిన చిత్రమే 'మేజర్'. శేష్ టైటిల్ పాత్ర పోషించారు. శోభిత, సయీ మంజ్రేకర్, ప్రకాశ్‌రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శశికిరణ్ తిక్కా దర్శకుడు. ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంస్థలతో కలిసి జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూన్ 3న తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానుంది.