"నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్".. 'బద్రి' అనగానే సినీ అభిమానులకు గుర్తొచ్చే డైలాగ్ ఇది. అంతగా పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ ఆకట్టుకున్నారు ఈ సినిమాతో. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? ఈ చిత్రం విడుదలై నేటికి 21 ఏళ్లు. 2000 ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు 'బద్రి'. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని విశేషాలు చూద్దాం..
విజయ లక్ష్మీ మూవీస్ పతాకంపై టి. త్రివిక్రమ రావు నిర్మించిన ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి చిత్రం. నాయిక రేణు దేశాయ్ ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అమీషా పటేల్ మరో నాయిక. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో పవన్ స్టైల్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. రమణ గోగుల సంగీతం ఉర్రూతలూగించింది. ముఖ్యంగా 'ఐ యామ్ ఇండియన్', 'ఏ చికితా', 'బంగాళాఖాతంలో నీరంటే' పాటలు శ్రోతల్ని విశేషంగా అలరించాయి. ఇప్పటికీ ఏదో సందర్భంలో ఈ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. పూరి జగన్నాథ్ మాటలు, పవన్ మ్యానరిజం, రమణ గోగుల పాటలు.. ఇలా అన్నీ అద్భుతంగా నిలిచి బాక్సాఫీసు వద్ద విజయాన్ని అందుకున్నాయి.