షారుక్ ఖాన్, కత్రినాకైఫ్‌తోపాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఇటీవల కరోనా బారినపడ్డారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బీటౌన్‌లో కరణ్ జోహార్ ఇచ్చిన బర్త్‌డే పార్టీ వల్లే సెలబ్రిటీలకు కరోనా వచ్చిందని పలువరు చెప్పుకొన్నారు కూడా. ఆ పార్టీని 'కరోనా సూపర్ స్ప్రెడర్'గా అభివర్ణిస్తూ పలు ఆంగ్ల పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా కరణ్ స్పందించారు.
"నేను ఇచ్చిన బర్త్‌డే పార్టీ 'కరోనా సూపర్ స్ప్రెడర్' అంటూ పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ వైరస్ ఎవరి నుంచి ఎవరికి ఎలా వచ్చిందో? ఎప్పుడు వచ్చిందో? ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ వారంలోనే ఇండస్ట్రీలో ఎన్నో ఫంక్షన్లు, సినిమా షూటింగులు, పెళ్లిళ్లు జరిగాయి. అలాంటప్పుడు నన్నే ఎందుకు నిందిస్తున్నారు? ప్రతిసారీ నన్నే ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు? ఈ మహమ్మారిని నేను సృష్టించలేదు, దాన్ని నేను వ్యాప్తి చేయలేదు. నాకు దానితో ఎలాంటి సంబంధంలేదు. అలాంటప్పుడు నన్నెందుకు శిక్షిస్తూ వార్తలు రాస్తున్నారు" అని కరణ్ ప్రశ్నించారు.